కేటరింగ్‌పై 18 శాతం జీఎస్టీ

21 May, 2017 07:30 IST|Sakshi
కేటరింగ్‌పై 18 శాతం జీఎస్టీ

- థీమ్‌ పార్క్, ఐపీఎల్‌ తరహా క్రీడలపై 28 శాతం..
- నాటకాలు, నృత్య ప్రదర్శనలపై 18 శాతం
- జీఎస్టీ అమలుతో రూ.వెయ్యి ఫోన్‌ బిల్లుపై రూ.30 అదనపు భారం


శ్రీనగర్‌: వినోదం కోసం థీమ్‌ పార్క్‌కో, సరదాగా ఐపీఎల్‌ మ్యాచ్‌కో వెళ్లాలంటే 28 శాతం జీఎస్టీ పన్ను వాత తప్పదు. మన ఇళ్లలో శుభకార్యాలకు ఆహారపదార్థాలు, శీతల పానీయాల కేటరింగ్‌పై 18 శాతం పన్ను కట్టాల్సిందే. ఇక వినోదాన్ని అందించే సర్కస్‌ ప్రదర్శనలు, శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, నాటక ప్రదర్శనల్ని 18 శాతం పన్ను జాబితాలోకి చేర్చారు. గురు, శుక్రవారాల్లో శ్రీనగర్‌లో నిర్వహించిన జీఎస్టీ మండలి భేటీలో వస్తువులు, సేవలపై పన్ను వివరాల్లో మరిన్ని తాజాగా వెల్లడయ్యాయి. జూలై 1 నుంచి జీఎస్టీ అమలులోకి రానున్న సంగతి తెలిసిందే.

మేధోహక్కుల్ని బదలాయిస్తే 12 శాతం పన్ను
విహారయాత్ర నిర్వాహకులు అందించే సేవలు, విమానం అద్దెకు తీసుకుంటే 5 శాతం పన్ను చెల్లించాలి. మేధో హక్కుల్ని తాత్కాలికంగా లేక శాశ్వతంగా ఎవరికైనా బదలాయించినా, వాడుకునేందుకు అనుమతించినా 12 శాతం పన్ను కట్టాలి. అయితే పశు కబేళాలు, పశువైద్య ఆస్పత్రులు అందించే సేవల్ని జీఎస్టీ నుంచి మినహాయించారు. జీఎస్టీ సేవల నుంచి విద్య, వైద్యంతో పాటు, మతపరమైన యాత్రలు, ధార్మిక కార్యక్రమాల్ని మినహాయించిన సంగతి తెలిసిందే.

వ్యక్తిగత న్యాయసేవలకు మినహాయింపు
టోల్‌గేట్‌ నిర్వాహకులు అందించే సేవలు, విద్యుత్‌ సరఫరా, పంపిణీ, ఇంటి అద్దెల్ని కూడా జీఎస్టీ నుంచి మినహాయించారు. సీనియర్‌ న్యాయవాది ఏ వ్యక్తికైనా న్యాయ సేవలందించినా.. రూ. 20 లక్షలలోపు వార్షిక టర్నోవర్‌ ఉన్న వ్యాపార సంస్థలకు న్యాయసేవలందించినా సేవా పన్ను చెల్లించనక్కర్లేదు. ప్రభుత్వ లైబ్రరీలు అందించే సేవలు, పుస్తకాల ముద్రణ, పళ్లు, కూరగాయల రిటైల్‌ ప్యాకేజింగ్, లేబిలింగ్‌కూ మినహాయింపు.

ఫోన్‌ బిల్లుల మోత
టెలికం సేవలపై ప్రస్తుతమున్న పన్నులను 15 నుంచి 18 శాతానికి పెంచడంతో ఫోన్‌ బిల్లులు పెరగనున్నాయి. మీరు నెలవారీ ఫోన్‌ బిల్లు రూ. 1000 చెల్లిస్తుంటే జూలై 1 నుంచి అదనంగా రూ. 30 చెల్లించాలి. అలాగే ప్రీపెయిడ్‌ ఖాతాదారులు రూ. 100తో రీచార్జ్‌తో రూ. 85 టాక్‌టైమ్‌ వస్తుండగా.. జీఎస్టీ అమలైతే రూ. 82 ల టాక్‌టైమ్‌ వస్తుంది.  అదే విధంగా మొబైల్‌ ఫోన్‌ ధరలు 4 నుంచి 5 శాతం పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనావేస్తున్నాయి. దేశీయంగా తయారవుతున్న మొబైల్‌ ఫోన్ల ధరలు పెరిగే అవకాశాలున్నాయి.

వారంలో రిఫండ్‌ చేస్తాం: సీతారామన్‌
జీఎస్టీ అమలైతే ఎగుమతిదారుల పన్ను రిఫండ్‌ దరఖాస్తులు వారం రోజుల్లోనే పరిష్కారమవుతాయని  వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ముందస్తుగా చెల్లించిన మొత్తాన్ని  10 రోజుల్లో రిఫండ్‌ చేస్తారని ఆలస్యం జరిగితే 6 శాతం వడ్డీతో ఎగుమతిదారులకు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. జీఎస్టీ అమలుతో ఎగుమతులు పెరుగుతాయని చెప్పారు. హెచ్‌1బీ వీసాల విషయంలో అమెరికా సర్కారు తీసుకుంటున్న చర్యలతో భారత ఐటీ నిపుణుల వీసాల సంఖ్యేమీ తగ్గదన్నారు. ‘వీసా విషయంలో ఐటీ రంగం భయపడాల్సిందేమీ లేదు. లాటరీ విషయంలోనే అమెరికా ప్రభుత్వం మార్పులు చేసుకోవాలనుకుంటోంది. ఇప్పుడున్న వీసాల సంఖ్యలో పెద్దగా తేడాలేమీ ఉండవు.’ అని అన్నారు.

మరిన్ని వార్తలు