రాజధానిలో పెరిగిన ఎయిడ్స్‌ కేసులు

4 Aug, 2018 14:30 IST|Sakshi

న్యూఢిల్లీ : గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దేశ వ్యాప్తంగా నమోదయిన ఎయిడ్స్‌ కేసుల సంఖ్య తగ్గింది.. కానీ రాజధాని ఢిల్లీలో మాత్రం ఈ సంఖ్య పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్లమెంట్‌ వర్షకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం లోక్‌సభలో సభ్యులు దేశవ్యాప్తంగా నమోదయిన ఎయిడ్స్‌ కేసుల వివరాల గురించి అడిగిన ప్రశ్నలకు, ఆరోగ్య, మంత్రిత్వ శాఖ ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానాలు అందించింది. గత మూడేళ్లుగా దేశవ్యాప్తంగా నమోదయిన ఎయిడ్స్‌ వ్యాధి కేసుల వివరాలను వెల్లడించింది.

ఈ వివరాల ‍ప్రకారం.. 2015 - 16 సంవత్సరంలో 2, 00, 465 ఎయిడ్స్‌ కేసులు నమోదు కాగా, 2013 - 17లో 1, 93, 195 కేసులు, 2017 - 18 సంవత్సరంలో 1, 90, 763 ఎయిడ్స్‌ కేసులు నమోదయినట్లు తెలిపింది. ఏడాదికేడాది దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఎయిడ్స్‌ కేసుల సంఖ్య తగ్గుతుండగా.. అందుకు విరుద్ధంగా రాజధాని ఢిల్లీలో మాత్రం ఎయిడ్స్‌ కేసుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్నట్లు ప్రకటించింది. 2017 - 18 సంవత్సరానికి గాను ఢిల్లీలో ఉన్న కొత్తగా 6,563 ఎయిడ్స్‌ కేసులను గుర్తించగా, గతేడాది ఈ సంఖ్య 6,340గా ఉన్నట్లు తెల్పింది.

అయితే ఈ పెరుగుదలకు కారణం ‘వలసలు’ అంటున్నారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు. ‘ఉపాధి కోసం ప్రతిరోజు ఎందరో రాజధానికి వలస వస్తుంటారు. అందువల్లే కొత్త కేసులు పెరుగుతున్నాయ’ని తెలిపారు. ప్రస్తుతం రాజధానిలో మొత్తం 28, 445 ఎయిడ్స్‌ కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఏడాది ఎయిడ్స్‌ వ్యాధి బారిన పడి దాదాపు 400 మంది మరణిస్తున్నారని ప్రకటించారు. 2017 - 18 సంవత్సరానికి గాను మహారాష్ట్రలో అత్యధికంగా ఎయిడ్స్‌ కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు.

అంతేకాక ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయా, మిజోరాం, త్రిపుర రాష్ట్రలు ఎయిడ్స్‌ వ్యాధికి హాట్‌స్పాట్స్‌గా మారాయన్నారు. త్వరలోనే రాజధాని ఢిల్లీలో ఒక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామన్నారు. అంతేకాక ఈ వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం మరో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు