వేధింపులకు ఆప్ మహిళా కార్యకర్త బలి

20 Jul, 2016 13:25 IST|Sakshi
వేధింపులకు ఆప్ మహిళా కార్యకర్త బలి

న్యూఢిల్లీ:  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో తనతోపాటు పనిచేసే ఓ కార్యకర్త వేధింపులు భరించలేక ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్య కు పాల్పడింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని నెరెల ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. వేధింపులకు గురిచేసిన అతడు స్వేచ్ఛగా బెయిల్ పై విడుదల కావడంతో మానసికంగా కుంగిపోయిన ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆప్ లో పనిచేస్తున్న రమేశ్ వాద్వా అనే వ్యక్తి నెరెలకు చెందిన మహిళా కార్యకర్తపై గత జూన్ లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేయగా కోర్టుకు వెళ్లి అతడు బెయిల్ తెచ్చుకుని దర్జాగా తిరగడం మొదలుపెట్టాడు. అది చూసి భరించలేకపోయిన ఆ యువతి తనకు న్యాయం జరగలేదని మానసికంగా కుంగిపోయి విషం తాగింది.

చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూసింది. కాగా అతడికి స్థానిక ఆప్  ఎమ్మెల్యే అండదండలున్నాయని, అందుకే ఈ విషయాన్ని అటు పార్టీ, ఇటు పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆందోళన చెంది ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో మహిళకు ఎంతటి గౌరవమైన స్థానం ఉందో ఈ ఒక్క సంఘటనతోనే తెలిసిపోతుందన్నారు. పేదింటి అమ్మాయనే ఎవరూ ఆమెను లెక్కచేయలేదని చెప్పారు. ఈ ఘటనపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు