అందరూ చూస్తుండగా వెరైటీ స్నానం

31 May, 2016 12:19 IST|Sakshi
అందరూ చూస్తుండగా వెరైటీ స్నానం

ఆగ్రా: యమునా నది పరిరక్షణతోపాటు ఆ పరిసరి ప్రాంతాల్లో నెలకొన్న నీటి సంక్షోభ తీవ్రతను కళ్లకు కట్టినట్లు చెప్పేందుకు కొంతమంది ఉద్యమకారులు, సామాజిక వేత్తలు వినూత్నంగా నిరసన చేపట్టారు. నది ఒడ్డున కూర్చుని ఇసుకతో స్నానం చేసి చుట్టుపక్కల వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఒక్కొక్కరి ముందు కుప్పలుగా ఇసుక పెట్టుకొని మీద గుమ్మరించుకున్నారు. యమునాలో ఇక మిగిలిందేం లేదు ఇదే అని అర్థం వచ్చేలా వారు ఈ నిరసన తలపెట్టారు.

ఇటీవల యమునా నది నిర్వహణ సరిగా లేని కారణంగా అందులో నీరు పూర్తిగా తగ్గిపోతోందని, ఉన్న నీరు కూడా ఉపయోగించుకునేందుకు వీలు లేకుండా తయారైందని, దాని పరిరక్షణ కోసం ఎన్నిసార్లు విన్నపాలు పెట్టుకున్నా అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేవారు తప్ప ఏం చేసిన వారు లేరని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఎవరో ఒకరు యమునా నది అంశాన్ని ప్రధాన అజెండా తీసుకొని ప్రచారానికి దిగడం అవి పూర్తవగానే ఆ అంశాన్ని మరుగున పడేయడం పరిపాటిగా మారిందని చెప్పారు. నాయకుల, అధికారుల నిర్లక్ష్యం కారణంగా యమునా నదిలో నీరు అడుగంటి పోతుందని, ఇక్కడికి వచ్చే వారికి పెద్దగా మిగిలేందేమీ లేదు ఇసుక మాత్రం తప్ప అని చెప్పేందుకు ఇసుకతో స్నానం చేశామని ఉద్యమకారుల్లో ఒకరైన బ్రజ్ ఖండేల్ వాల్ తెలిపాడు.

మరిన్ని వార్తలు