Delhi: Yamuna Water Level Crosses Danger Mark Again - Sakshi
Sakshi News home page

Yamuna River Floods: రికార్డు స్థాయికి చేరిన యమునా నది ప్రవాహం..

Published Wed, Aug 16 2023 7:48 AM

Delhi Yamuna Water Level Crosses Danger Mark Again - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్న వర్షాల ప్రభావానికి యమునా నది మరోసారి పోటెత్తింది. కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అటు ఉత్తరాఖండ్ ఇటు హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. మరో 24 గంటలపాటు భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ శాఖ తెలపడంతో అధికారులు ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 

గత నెలలో దేశ రాజధానిలో కురిసిన భారీ వర్షాలకు రహదారులన్నీ నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి.  యమునా నది ప్రవాహమైతే జులై 13న అత్యధికంగా 208.66 మీ. రికార్డు స్థాయికి చేరుకోగా తాజాగా మరోసారి అలాంటి పరిస్థితే నెలకొంది. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో యమునా నది ప్రవాహం పాత రైల్వే బ్రిడ్జి వద్ద 205.39 మీటర్లకు చేరినట్లు సెంట్రల్ వాటర్ కమీషన్(CWC) తెలిపింది. 

హర్యానాలోని యమునానగర్ హాత్నికుండ్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి నీటి ప్రవాహం ఉధృతి 30,153 క్యూసెక్కులకు చేరినట్లు చెబుతోంది సెంట్రల్ వాటర్ కమీషన్. హిణాచల్ ప్రదేశ్ లోనూ, ఉత్తరాఖండ్ లోనూ మరో 24 గంటలపాటు భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు ఐఎండీ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది.  

హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు కొండతట్టు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొండ చరియలు జారి పడటం, వరదలు, మేఘ విస్ఫోటనాలు సంభవించడంతో ప్రాణ నష్టం కూడా పెరుగుతూ వచ్చింది. ఒక్క  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే ఇప్పటివరకు 55 మంది మృతి చెందారు. 

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు మొదలుపెట్టామని రహదారులపై చిక్కుకున్న వారిని విడిపించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు కృషి చేస్తున్నాయని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు. కల్క -షిమ్లా, కీరత్ పుర్-మనాలి, పఠాన్ కోట్ - మండి, ధర్మశాల - షిమ్లా  రహదారులన్నీ మూసివేసినట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఎర్ర‌కోట వేడుక‌కు హాజ‌రుకాని మ‌ల్లికార్జున ఖ‌ర్గే.. నెట్టింట వైరల్‌గా ఖాళీ కుర్చి   

Advertisement
Advertisement