అమితాబ్‌కు పద్మ విభూషణ్

9 Apr, 2015 00:57 IST|Sakshi
అమితాబ్‌కు పద్మ విభూషణ్

ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
 
న్యూఢిల్లీ: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(72) ప్రతిష్టాత్మక పౌరపురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేశారు. తెలుగు తేజాలైన ప్రవాసాంధ్రుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్, తెలుగుసినీ నటుడు కోటా శ్రీనివాసరావులు పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. అమితాబ్‌తోపాటు న్యాయ కోవిదుడు కె.కె.వేణుగోపాల్, కర్ణాటకలోని శ్రీమంజునాథ స్వామి ఆలయ ధర్మాధికారి డి.వీరేంద్ర హెగ్డే, అణుశాస్త్రవేత్త ఎం.రామస్వామి శ్రీనివాసన్, ప్రముఖ వ్యాపారవేత్త కరీం అగా ఖాన్ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, సీనియర్ మంత్రులు, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు హాజరయ్యారు.

అమితాబ్ భార్య జయా బచ్చన్, తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, కూతురు శ్వేతానంద, ఆమె కొడుకు అగస్త్య, కూతురు నవ్య నవేలి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా పద్మ విభూషణ్ అవార్డు అందుకునేందుకు ప్రముఖ సినీనటుడు దిలీప్ కుమార్(92) రాలేకపోయారు. ఇక పద్మ భూషణ్ అందుకున్న వారిలో సినీ ప్రముఖులు జాను బారువా, గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ మంజుల్ భార్గవ, కంప్యూటర్ సైంటిస్ట్ విజయ్ భట్కార్, ఆధ్యాత్మిక గురువు స్వామి సత్యమిత్రానంద్ గిరి, పండిట్ గోకులోత్సవ్ జి మహరాజ్, రాజ్యాంగ నిపుణులు సుభాశ్ సి కశ్యప్, ప్రముఖ వైద్యులు అంబరీశ్ మిట్టల్ ఉన్నారు. కర్ణాటకలోని శ్రీసిద్ధగంగ మఠం అధినేత శివకుమార స్వామి(107) పద్మభూషణ్ అవార్డు అందుకునేందుకు రాలేకపోయారు.
 

మరిన్ని వార్తలు