ఢిల్లీ అసెంబ్లీ అత్యవసర భేటీ

24 May, 2015 02:32 IST|Sakshi
ఢిల్లీ అసెంబ్లీ అత్యవసర భేటీ

కేంద్రం నోటిఫికేషన్‌పై చర్చ కోసం ఆప్ సర్కారు నిర్ణయం

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్(ఎల్జీ)తో తలెత్తిన ఘర్షణలో ఆప్ సర్కారు కొత్త ఆయుధాలు బయటికి తీస్తోంది. ప్రభుత్వాధికారుల నియామకం, పోలీసు, శాంతిభద్రతల అంశాల్లో ఎల్జీకి సర్వాధికారాలు ఉంటాయని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై చర్చించేందుకు ఈ నెల 26, 27న అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో శనివారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే సమావేశాలను పొడిగించాలని కూడా నిర్ణయించారు.

వాస్తవానికి బడ్జెట్‌ను ఆమోదించేందుకు అసెంబ్లీ జూన్‌లో సమావేశం కావాల్సి ఉంది. అసెంబ్లీ అత్యవసర సమావేశాల్లో.. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తోపాటు ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర సర్కారుకు, ఎల్జీకి మధ్య అధికార పంపిణీ అంశాలపైనా చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర సర్కారు ఈ నోటిఫికేషన్‌పై రాజ్యాంగ నిపుణుడైన కేకే వేణుగోపాల్, మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణియంల అభిప్రాయాలు కోరగా, వారు అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారన్నారు. వేణుగోపాల్, సుబ్రమణియంల అభిప్రాయాలపై కేబినెట్ భేటీలో చర్చించారని సీఎం కార్యాలయం కూడా తెలిపింది. సీనియర్ అధికారి శకుంతలా గామ్లిన్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎల్జీ గత వారం నియమించడంతో ఆప్‌కు, ఎల్జీకి మధ్య ఘర్షణ తలెత్తడం తెలిసిందే.

మరిన్ని వార్తలు