మీ ఇష్టం ఇక చెలరేగిపోండి

16 Feb, 2018 08:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దులో పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలపై భారత సైన్యం కీలక ప్రకటన చేసింది. ఇకపై సహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ కాల్పులను ధీటుగా స్పందించాలని.. ఇందుకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు సైన్యాధికారులకు(కమాండర్‌) ఆదేశాలు జారీ చేసింది. 

‘గత కొన్ని వారాలుగా సరిహద్దు వెంబడి పాక్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రాను రాను ఈ ఘటనలు పెరిగిపోతున్నాయి. దానికి భారత్‌ కూడా గట్టి సమాధానమే ఇస్తోంది. ఇకపై  దూకుడు మరింత పెంచండి. పాక్‌ సైన్యం కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించినా, ఉగ్రవాదులకు దాడులకు-చొరబాటులకు యత్నించినా మీరూ ధాటిగానే సమాధానం ఇవ్వండి. వారికి అడ్డుకట్ట వేసేందుకు ఎంతటికైనా తెగించండి. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. చర్యలకు దిగినా... సైన్యం మీకు పూర్తి సహకారం అందిస్తుంది’ అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.  

కాగా, తాజాగా సరిహద్దులో దాడులు తీవ్ర తరం కావటం చూస్తున్నాం. జమ్ము లోని రాజౌరీ ఉగ్రదాడిలో నలుగురు సైనికులు, సుంజువాన్‌ మిలిటరీ స్టేషన్‌ పై ఉగ్రదాడిలో ఓ పౌరుడు సహా ఆరుగురు సైనికులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో ఇకపై ఉపేక్షించాల్సిన అవసరం లేదని భారత సైన్యం నిర్ణయించుకున్నట్లు స్పష్టమౌతోంది. భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ‘పాక్‌ ఇందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించటం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు