అత్యంత విషమంగా వాజ్‌పేయి ఆరోగ్యం

16 Aug, 2018 10:05 IST|Sakshi
అటల్‌ బిహారీ వాజ్‌పేయి (ఫైల్ ఫోటో)

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ప్రస్తుతం వాజ్‌పేయికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.  ఆయన ఆరోగ్యాన్ని ఎయిమ్స్‌ వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. బుధవారం సాయంత్రానికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా, గురువారం ఉదయానికి విషమంగా మారింది. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలోని 15 మంది వైద్యుల బృందం వాజ్‌పేయికి చికిత్స అందిస్తోంది. ఒక ప్రత్యేకమైన వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వాజ్‌పేయి  ఆరోగ్యంపై ఆందోళన నెలకొనడంతో కేంద్ర మంత్రులతో పాటు పలువురు అగ్రనేతలు ఒక్కొక్కరిగా ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు.

వాజ్‌పేయిని ఉప రాష్టపతి వెంకయ్య నాయుడు.. ఎయిమ్స్‌ చేరుకుని వాజ్‌పేయి ఆరోగ్యం ఆరా తీశారు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఎయిమ్స్‌కు చేరుకున్నారు. మరోసారి వాజ్‌పేయిని పరామర్శించడానికి ప్రధాని మోదీ ఎయిమ్స్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో పాటు ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా, పీయూష్‌, హర్షవర్ధన్‌, సురేష్‌ ప్రభు, జితేంద్ర సింగ్‌, అశ్విన్‌ కుమార్‌ చౌబే, సురేష్‌ ప‍్రభు, ఢిల్లీ సీఎం అరవింద్‌ క్రేజీవాల్‌లు వాజ్‌పేయిని పరామర్శించిన వారిలో ఉన్నారు. కాగా, అమిత్‌ షా, జేపీ నడ్డాలు ఎయిమ్స్‌లో ఉండి వాజ్‌పేయి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పడు వాకబు చేస్తున్నారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉండటంతో బీజేపీ తన అధికారిక కార్యక‍్రమాల్ని వాయిదా వేసుకుంది. జూన్‌ 11 నుంచి ఎయిమ్స్‌లో వాజ్‌పేయి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మూత్రనాళ ఇన్ఫెక్షన్, ఛాతీలో ఇబ్బంది.. తదితర అనారోగ్య కారణాలతో వాజ్‌పేయి గత రెండు నెలల నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.


 

>
మరిన్ని వార్తలు