సీతపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు 

2 Oct, 2019 18:07 IST|Sakshi

రుద్రాపూర్‌ :  దసరా సమయంలో ఉత్తర భారతంలోని అన్ని గ్రామాల్లోనూ దాదాపు రామ్‌లీలా నాటకం వేస్తారు. సీతారాముల గొప్పతనం నేటి తరానికే తెలియజేసేందుకే ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. అయితే ఉత్సవాల్లో భాగంగా రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించిన ఓ బీజేపీ ఎమ్మెల్యే సీతాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీత మేరీ జాన్’‌. అంటూ అసభ్యకరంగా సంభోదించి చిక్కుల్లో పడ్డారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ తుక్రాల్‌.. గత ఆదివారం నియోజకవర్గంలో ప్రదర్శించిన రామ్‌లీలా నాటకంలో రావణాసురుడు పాత్ర వేశారు. సీతా దేవి, రావణునికి మధ్య వచ్చే సన్నివేశంలో భాగంగా ‘ సీతా మేరీ జాన్‌’ అంటూ సీతా దేవిని సంభోదించారు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా నవ్వారు. అయితే నాటక నిర్వాహకులు మాత్రం అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ ఆయన అలాగే సంభోదించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

 కాగా, ఈ వీడియోపై రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుడు సూర్యకాంత్‌ స్పందిస్తూ.. ఈ ఒక్క మాట చాలు రాజ్‌కుమార్‌కు సీతారాములపై ఉన్న గౌరవం ఏంటో తెలిసిపోయిందన్నారు. రావణుడు కూడా సీతమ్మను ఎప్పడూ ‘ సీతా దేవి’  అని సంభోదించేవాడని గుర్తుచేశారు. రాజ్‌కుమార్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా, రాజ్‌కుమార్‌ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. నాటకంలో భాగంగానే తాను సీతాదేవిని ‘మేరీ జాన్‌’ అని సంభోదించానని, అంతేకానీ వేరే ఉద్దేశంతో కాదన్నారు. అక్కడ మాట్లాడింది కేవలం రావణాసుర పాత్రదారే తప్ప రాజ్‌కుమార్‌ కాదన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా