ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

15 Jul, 2019 18:12 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ముస్లింలు ఇష్టమొచ్చినట్టుగా జంతువుల్లా కనిపారేస్తున్నారని విమర్శించారు. సోమవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ముస్లిం కుటుంబాల్లో ఒక్కొక్కరికీ 50 మంది పెళ్లాలుంటారు. వాళ్లు 1050 మంది పిల్లల్ని కంటారు. ఇది వారి మత సాంప్రదాయం కూడా కాదు. ఇష్టమొచ్చినట్టు కంటూ జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా అయితే.. ఓ కుంటుంబంలో ఇద్దరు లేదా నలుగురు పిల్లలు మాత్రమే ఉంటారు. కానీ ముస్లిం కుటుంబాల్లో ఇందుకు భిన్నంగా ఉంది. అంటూ వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారు.

సురేంద్రసింగ్‌ నోరు పారేసుకోవటం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు నోరు జారి విమర్శలపాలయ్యారు. గతంలో హిందూ దంపతులు కనీసం ఐదుగురి పిల్లల్ని కనాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీని ద్వారా హిందుత్వాన్ని కాపాడిన వారవుతారని ఆయన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. గత మార్చి నెలలో సైతం కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి అనుచిత సలహానిస్తూ పతాక శీర్షికల్లోకెక్కారు. రాహుల్‌ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘‘మీ తల్లి ఇటలీలో ఉన్నప్పుడు ఏ వృత్తిలో కొనసాగిందో, హర్యాన్వి గాయని, డ్యాన్సర్‌ సప్న చౌదరి కూడా అదే వృత్తిలో  ఉన్నారు. కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు కదా’’ అని కామెంట్స్‌ చేసిన విషయం విదితమే.

ఆ తర్వాతి కాలంలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిపై కూడా మాటల దాడికి దిగారు. మాయావతి వయస్సు 60 సంవత్సరాలు దాటినా అందంగా కనిపించడం కోసం ఫేషియల్‌ చేయించుకుంటుందని ఎద్దేవా చేశారు. యవ్వనంగా కనిపించడం కోసం జుట్టుకు రంగులు వేసుకుంటుందని విమర్శించారు. ఇక దేశంలో అత్యాచారాలు, మహిళలపై దాడులు పెరిగిపోవటానికి పిల్లల తల్లిదండ్రులు, మొబైల్‌ ఫోన్లే ప్రధాన కారణమంటూ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడి విమర్శల పాలయ్యారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు