వాళ్ల దోస్తీ ఎలాంటిదో చెప్పాలి : మాయావతి

16 Dec, 2019 08:31 IST|Sakshi

లక్నో :  కాంగ్రెస్‌ పార్టీ దంద్వ వైఖరిపై బీఎస్పీ చీఫ్‌ మాయావతి విమర్శలు గుప్పించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతునిచ్చిన శివసేనతో కాంగ్రెస్‌ దోస్తీ ఎలాంటిదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి అధికారం పంచుకుంటూనే రాహుల్‌ వీర సావర్కర్‌ వ్యాఖ్యలను శివసేన తప్పుబట్టడుతోందని అన్నారు. కాగా, ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శనివారం జరిగిన ‘భారత్‌ బచోవో ర్యాలీ’లో రాహుల్‌ గాంధీ ‘నేను రాహుల్‌ సావర్కర్‌ను కాదు’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. భరత జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన సావర్కర్‌ను అందరూ గౌరవించాలని స్పష్టం చేసింది.

‘కాంగ్రెస్‌ వ్యతిరేకించిన పౌరసత్వ సవరణ బిల్లుకు శివసేన మద్దతు పలికింది. ఇప్పుడు అదే శివసేన రాహుల్‌ గాంధీ సావర్కర్‌ వ్యాఖ్యలను తప్పుబడుతోంది. మళ్లీ మహారాష్ట్రలో రెండు పార్టీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్‌ దంద్వ విధానాలకు నిదర్శనం’ అని మాయావతి ట్విటర్‌లో విమర్శలు గుప్పించారు. అసలు కాంగ్రెస్‌ విధానమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కాంగ్రెస్‌ తన బలహీనతను కప్పిపుచ్చుకునేందుకు నాటుకాలు ఆడుతోందని ప్రజలు భావిస్తారని అన్నారు. 

>
మరిన్ని వార్తలు