అద్దె గర్భాల బిల్లుకు కేబినెట్‌ ఓకే

27 Feb, 2020 04:09 IST|Sakshi

న్యూఢిల్లీ: మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు అద్దె గర్భం నియంత్రణ బిల్లు–2020పై బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం ఆమోద ముద్ర వేసింది. వితంతువులు, విడాకులు పొందిన వారూ ఇతరులకు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చని బిల్లు స్పష్టం చేసింది. సరోగసీపై గతంలోని ముసాయిదా బిల్లులన్నింటినీ అధ్యయనం చేసి రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీ ఇచ్చిన సూచనలు అన్నింటినీ తాజా బిల్లులో పొందుపరిచినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మీడియాతో చెప్పారు.

సరోగసీని వాణిజ్యానికి వాడకుండా నిరోధించడం, మంచి ఉద్దేశమైతే సరొగసీకి సహకరించడం ఈ కొత్త బిల్లు లక్ష్యాలని మంత్రి చెప్పారు. కొత్త బిల్లు ప్రకారం.. దేశంలో భారత్‌కు చెందిన దంపతులు మాత్రమే సరోగసి చేపట్టేందుకు వీలుంటుందని మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. అబార్షన్‌ మొదలుకొని సరోగసి వరకూ వేర్వేరు అంశాల్లో మహిళల హక్కులపై ప్రధాని మోదీ విశాల దృక్పథంతో వ్యవహరిస్తున్నారని ఆమె చెప్పారు.

సరోగసీ చట్టాలను సవరిస్తూ గత ఆగస్టులో లోక్‌సభ ఒక ముసాయిదా బిల్లును ఆమోదించింది. అయితే దగ్గరి బంధువులే అద్దెకు గర్భాన్ని ఇవ్వొచ్చనే నిబంధనపై విమర్శలొచ్చాయి. దీంతో బిల్లును రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీకి పంపింది. బీజేపీ ఎంపీ భూపేందర్‌ యాదవ్‌ నేతృత్వంలోని కమిటీ సరోగసీకి సంబంధించి అన్ని వర్గాల వారితోనూ చర్చించి బిల్లులో సవరణలను ప్రతిపాదించింది. సూచనలు చేసింది. వీటిని పొందుపరిచిన బిల్లును బుధవారం కేబినెట్‌ ఆమోదించగా బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే వీలుంది.

కశ్మీర్‌లో కేంద్ర చట్టాల అమలుకు ఆదేశాలు
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ఉమ్మడి జాబితాలోని 37 కేంద్ర చట్టాలు అమలు చేసే ఆదేశాన్ని కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. గత ఆగస్టులో అవిభక్త కశ్మీర్‌ రాష్ట్రానికున్న ప్రత్యేక ప్రతిపత్తి హోదా(ఆర్టికల్‌ 370)ను రద్దుచేసి రాష్ట్రాన్ని ‘జమ్మూకశ్మీర్‌’, ‘లడాక్‌’ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం తెల్సిందే. దేశం మొత్తానికి అన్వయించే కేంద్ర చట్టాలు (జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాన్ని మినహాయించి) ఇకపై ఈ కేంద్ర పాలిత ప్రాంతాలకూ వర్తిస్తాయని అప్పట్లో ఒక ప్రకటన వెలువడింది.

కేంద్రం ఆమోదంతో జమ్మూ కశ్మీర్‌ రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌ కింద ఆదేశాలు జారీ చేసేందుకు మార్గం సుగమమైంది. బుధవారం నాటి కేంద్ర కేబినెట్‌ సమావేశంలో హరియాణా, తమిళనాడుల్లో రెండు ఆహార సంబంధిత సంస్థలకు జాతీయ స్థాయి కల్పిస్తూ నిర్ణయం జరిగింది. ఇందుకు అనుగుణంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్,మేనేజ్‌మెంట్‌ చట్టానికి సవరణలు చేశామని జవదేకర్‌ తెలిపారు. జాతీయ స్థాయి గుర్తింపు తర్వాత ఆ సంస్థలు విదేశీ సంస్థల నుంచి నేరుగా సాయం పొందొచ్చు.  

బిల్లులోని ముఖ్యాంశాలు
కేంద్రం, రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిల్లో జాతీయ సరోగసీ బోర్డుల ఏర్పాటు
► అద్దెకు గర్భాన్ని ఇచ్చే మహిళకు చేసే బీమా మొత్తాన్ని 36 నెలలకు పెంచారు.
► మానవ పిండాలు, గామేట్స్‌ (బీజం) కొనుగోలు, విక్రయాలపై నిషేధం. నైతిక సరోగసికి మాత్రమే అనుమతి. భారతీయ దంపతులు, భారతీయ సంతతి దంపతులు, 35–45 ఏళ్ల వితంతు మహిళ లేదా విడాకులు పొందిన మహిళలకే సరోగసి అనుమతి లభిస్తుంది.

మరిన్ని వార్తలు