బిజినెస్‌లోనూ భేష్.. | Sakshi
Sakshi News home page

బిజినెస్‌లోనూ భేష్..

Published Fri, Jun 13 2014 10:58 PM

బిజినెస్‌లోనూ భేష్..

టెన్నిస్‌లో ఏస్...
 
బొటాబొటీ డబ్బులతో ఏడేళ్ల వయస్సులో తండ్రితో పాటు అమెరికాలో అడుగుపెట్టిన మరియా షరపోవా .. టెన్నిస్‌లో ఒక సెన్సేషన్. పదిహేడేళ్లకే ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ టైటిల్ సాధించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను కూడా ఖాతాలో వేసుకుంది. నాన్న తన కోసం చేసిన అప్పులన్నీ తొలి టైటిల్ ప్రైజ్‌మనీతో తీర్చేద్దామనుకున్న షరపోవా.. ప్రస్తుత సంపద విలువ సుమారు రూ. 540 కోట్ల పైచిలుకు ఉంటుందని అంచనా.

ఇటీవలే మరోసారి ఫ్రెంచ్ ఓపెన్‌ని గెల్చుకుని ఇంకాస్త ప్రైజ్‌మనీ దక్కించుకుంది. టెన్నిస్ కోర్టులో అడపాదడపా విఫలమైనా.. యాడ్స్‌తో గణనీయంగానే ఆర్జించింది షరపోవా. నైకీ, కోల్  హాన్ వంటి కంపెనీలు ప్రత్యేకంగా ఆమె పేరు మీద స్పోర్ట్స్ వేర్ కలెక్షన్ కూడా రూపొందించాయి. తాను స్వయంగా డిజైన్ చేసిన వాటిపై ఆమెకు రాయల్టీ కూడా వస్తుంది.
 
ఫామ్‌లో ఉన్నప్పుడు టెన్నిస్ కోర్టులో ఎలాగైతే చలాకీగా చెలరేగిపోతుందో.. అలాగే వ్యాపార రంగంలోనూ దూసుకె ళ్లిపోతోందీ భామ.  దీపం ఉన్నప్పుడే చందంగా.. బిజినెస్ వెంచర్స్‌ను చక్కబెడుతోంది. తన పేరు కలిసొచ్చేలా సుగర్‌పోవా పేరిట కొన్నేళ్ల క్రితం క్యాండీస్ వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. రేటు కాస్త ఎక్కువైనా ఇవి హాట్‌కేకుల్లాగా అమ్ముడయ్యాయి. పెట్టిన పెట్టుబడిపై స్వల్పకాలంలోనే షరపోవాకు ఏకంగా 120 శాతం మేర రాబడులు వచ్చాయి.

ప్రస్తుతం పాతిక పైగా దేశాల్లో సుగర్‌పోవా క్యాండీలు అమ్ముడవుతున్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో కొంత  భాగాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం కూడా ఉపయోగిస్తోంది షరపోవా.  ఇదే ఉత్సాహంతో సౌందర్య సాధనాల రంగంలోకి కూడా అడుగుపెట్టిందామె. సూపర్‌గూప్ అనే కంపెనీలో పెట్టుబడులు పెట్టి,  వాటాదారుగా చేరింది.
 

Advertisement
Advertisement