భార‌త్‌ పహారాకు చైనా ఆటంకం

21 May, 2020 19:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: నియంత్ర‌ణ‌ రేఖ వ‌ద్ద భార‌త పెట్రోలింగ్‌కు చైనా ఆటంకం క‌లిగిస్తోంద‌ని భార‌త విదేశాంగ శాఖ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. భార‌త సైనిక కార్య‌క‌లాపాలు వాస్తవాధీన రేఖకు లోపలే ఉన్నాయని వెల్లడించింది. భార‌త ద‌ళాలు సిక్కింలో ఎల్ఏసీని దాట‌లేదని స్ప‌ష్టం చేసింది. స‌రిహ‌ద్దు వెంట శాంతి భ‌ద్రత‌ల‌కు భార‌త్ కట్టుబ‌డి ఉంద‌ని తెలిపింది. కానీ త‌మ ర‌క్ష‌క దళాల భ‌ద్ర‌త విషయంలో రాజీపడబోమని దీటుగా జ‌వాబిచ్చింది. కాగా భారత్‌ సరిహద్దుల్లో చైనా ఇటీవల కవ్వింపు చర్యలకు దిగడంతో భారత సైన్యం అప్రమత్తమైన సంగతి తెలిసిందే.  (డ్రాగన్‌ దూకుడుపై అమెరికా ఫైర్‌)

గాల్వ‌న్ న‌ది ద‌గ్గ‌ర చైనా గుడారాలు వేసిందని నివేదిక‌లు వ‌చ్చిన త‌ర్వాత భార‌త్ ఆ ప్రాంతంలో అధిక సంఖ్య‌లో ద‌ళాల‌ను మొహ‌రించింది. మ‌రోవైపు గ‌త నెల‌లో ఉత్త‌ర సిక్కిం, ల‌డ‌ఖ్‌లోని  ప్యాంగ్యాంగ్‌ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగ‌గా పరస్పరం రాళ్లు విసురుకున్నారు. మ‌రోసారి స‌రిహ‌ద్దులో చైనా హెలికాప్ట‌ర్లు గ‌గ‌న‌త‌లంలో కనిపించ‌డంతో భార‌త్ సైతం సుఖోయ్-30 విమానాల‌ను మొహరించింది. చైనా దుందుడుకు చ‌ర్య‌ల‌పై అమెరికా సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. (‘చైనా హెలికాప్టర్‌ చొరబాటుకు యత్నించింది’)

మరిన్ని వార్తలు