మోదీజీ వెల్‌కమ్

7 Aug, 2016 03:30 IST|Sakshi
మోదీజీ వెల్‌కమ్

నేడు మధ్యాహ్నం 2.20 గంటలకు నగరానికి రాక
ప్రత్యేక హెలికాప్టర్లలో గవర్నర్, సీఎంతో కలసి 3 గంటలకు సభాస్థలికి
మెదక్ జిల్లా కోమటిబండలో భారీగా ఏర్పాట్లు
తొలుత ‘మిషన్  భగీరథ’ ప్రారంభం.. తొలి నల్లాకు నీటి విడుదల
అక్కడే మరో ఐదు పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
అనంతరం బహిరంగ సభలో ప్రసంగం
నగరంలోని బీజేపీ మహాసమ్మేళనంలో పాల్గొననున్న ప్రధాని మోదీ
నాలుగున్నర గంటల పాటు పర్యటన.. సాయంత్రం 6.15కు ఢిల్లీకి..
 
ప్రధానమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం..
సాక్షి, హైదరాబాద్:
రెండేళ్ల కింద ఏర్పడిన తెలంగాణ కొత్త రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా అడుగుపెడుతున్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీటిని అందించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు మరో ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయన వెంట ఐదుగురు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, పీయూష్ గోయల్, అనంత్‌కుమార్, బండారు దత్తాత్రేయ తదితరులూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎన్నో అంచనాలు, మరెన్నో ఆశల మధ్య ప్రధాని మోదీ రాక రాష్ట్ర రాజకీయ శ్రేణుల్లో, అధికారవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇక ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. దాదాపు రెండు లక్షల మందిని బహిరంగ సభకు తరలించేందుకు సన్నాహాలు చేసింది. వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సభాస్థలిని ఏర్పాటు చేసింది.

ఘనంగా స్వాగతానికి ఏర్పాట్లు
ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ తదితరులు ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచే గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రులతో కలసి మూడు ప్రత్యేక హెలికాప్టర్లలో మెదక్ జిల్లా కోమటిబండకు బయలుదేరుతారు. ప్రధానికి సంప్రదాయంగా స్వాగతం పలకడంతో పాటు వివిధ కార్యక్రమాల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు చేసింది. కోమటిబండలో ప్రారంభోత్సవాలు, సభ అనంతరం సాయంత్రం ఐదు గంటల సమయంలో మోదీ తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళనంలో పాల్గొని... పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.

ప్రధాని పర్యటనపై భారీ ఆశలు
ప్రధాని మోదీ తొలిసారిగా రాష్ట్రానికి రానుండటంతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా కేంద్రం నుంచి ఆశించినంత సహకారం అందడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు మొదలు ప్రత్యేక ప్యాకేజీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు ఆర్థిక సాయం అందించాలని పలుమార్లు సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని స్వయంగా కలసి విజ్ఞప్తి చేశారు. మరో రూ.1,000 కోట్ల రుణసాయం అందించాలని కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న బృహత్తర పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. వీటిని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు రూ.24,650 కోట్లు విడుదల చేయాలని ఇటీవలే నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇంటింటికీ తాగునీరు అందించే మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, చెరువుల పునరుద్ధరణ (మిషన్ కాకతీయ)కు రూ.5,000 కోట్లు ఇవ్వాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాని తన తొలి పర్యటనలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు తమవంతుగా ఎలాంటి సాయం ప్రకటిస్తారనేది ఆసక్తి రేపుతోంది.
 
 
 నాలుగున్నర గంటల్లో..
 రాష్ట్రంలో మోదీ పర్యటన పూర్తి వివరాలివే..

 2.20: బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ రాక
 2.25: బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో గజ్వేల్ పయనం
 2.50: గజ్వేల్‌లోని నెమటూర్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు
 2.55: హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణం
 3.00: ప్రారంభోత్సవం జరిగే కోమటిబండ వద్దకు చేరుకుంటారు
 3.01: మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ
 3.03: గ్రామాలకు నీటి సరఫరా చేసే పంపు ఆవిష్కరణ
 3.04: మిషన్ భగీరథ మొదటి నల్లా ప్రారంభం
 3.05: మిషన్ భగీరథ తీరుతెన్నులపై ప్రదర్శన
 3.10: బహిరంగసభ జరిగే ప్రాంతానికి చేరుకుంటారు
 3.15 నుంచి 3.24 వరకు: 1,600 మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ శంకుస్థాపన, రామగుండం ఎరువుల కర్మాగారం (ఎఫ్‌సీఐ) పునరుద్ధరణ, మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేలైన్ శంకుస్థాపన, వరంగల్‌లోని కాళోజీ విశ్యవిద్యాలయం శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి నిర్మించిన 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్‌ను జాతికి అంకితం చేస్తారు.
 
 3.25: బహిరంగసభ వేదిక పైకి రాక
 3.27: కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతోపన్యాసం
 3.30-3.37: సీఎం కేసీఆర్ ప్రసంగం
 3.37-4.10: ప్రధాని మోదీ ప్రసంగం
 4.13: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందన సమర్పణ
 4.20: కోమటిబండ నుంచి బయలుదేరుతారు
 4.25: నెమటూర్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు
 4.30: హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు పయనం
 4.55: బేగంపేటకు చేరుకుంటారు
 5.00: బేగంపేట విమానాశ్రయం నుంచి
 రోడ్డు మార్గంలో ఎల్‌బీ స్టేడియానికి వస్తారు
 5.15-6.15: బీజేపీ కార్యకర్తల మహాసమ్మేళనంలో పాల్గొంటారు
 6.20- 6.35: ఎల్‌బీ స్టేడియం నుంచి
 రోడ్డు మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి వస్తారు
 6.40: ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు
 
 
ఘనంగా స్వాగతిద్దాం

ఏర్పాట్లపై సమీక్షలో కేసీఆర్
జయశంకర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు శనివారం తెలంగాణ భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్... ప్రధాని పర్యటన ఏర్పాట్లపై పలువురు మంత్రులు, పార్టీ నాయకులతో సమీక్షించారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. మోదీ తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వస్తున్నందున ఘనంగా స్వాగ తం తెలపాలని కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల నుంచి కనీసం రెండు వేల మంది చొప్పున తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భారీగా తరలించాలన్నారు. భద్రతా కారణాల రీత్యా సభా వేదికపైకి కొందరికే అనుమతి ఉంటుందని... అవకాశం రాని మంత్రులు సంయమనం పాటించాలని సూచించినట్లు తెలిసింది.
 
కండువాలు, జెండాలకు అనుమతి లేదు
సభాస్థలిలో పార్టీల కండువాలకు, జెండాలకు, బ్యానర్లకు, ఫ్లెక్సీలకు అనుమతి లేదు. వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువులు తీసుకెళ్లడాన్ని కూడా నిషేధించినట్లు మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎస్పీజీ నిబంధనల ప్రకారం కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమతోపాటు ఎక్కువ మందిని తీసుకువచ్చే పరిస్థితి లేదని.. వారికోసం ప్రత్యేకంగా రిసెప్షన్  కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రముఖులకు, మీడియాకు మధ్యాహ్నం ఒంటిగంటకు భోజన ఏర్పాట్లు చేశారు.
 
 
ప్రధాని ప్రారంభించే పథకాల విశేషాలివే..
మిషన్ భగీరథ
రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చేపట్టిన బృహత్ పథకమిది. మొత్తం రూ.42 వేల కోట్ల అంచనాతో 26 ప్యాకేజీలుగా ఈ పథకాన్ని సర్కారు చేపట్టింది. తొలిదశలో తొమ్మిది నియోజకవర్గాలకు తాగునీటిని అందించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని 243 ఆవాసాల్లో 66 వేల కుటుంబాలకు తాగునీటిని అందించే పథకాన్ని ప్రధాని ప్రారంభిస్తారు.
 
సింగరేణి విద్యుత్ కేంద్రం
ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో రూ.8,250 కోట్లతో సింగరేణి ఈ ప్రాజెక్టును చేపట్టింది. 1,200 మెగావాట్ల ఈ విద్యుత్ కేంద్రం మొదటి యూనిట్‌లో జూన్ నుంచి, రెండో యూనిట్‌లో జూలై 27 నుంచి  విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇప్పటివరకు తొలి యూనిట్ 140 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసింది. ఈ ప్లాంటును ప్రధాని జాతికి అంకితం చేస్తారు.

రామగుండం ఎరువుల కర్మాగారం
మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.5,254 కోట్లతో పునరుద్ధరిస్తోంది. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ సంయుక్త భాగస్వామ్యంలో ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 2,200 ఎంటీపీడీ అమ్మోనియా యూనిట్‌ను, 3,850 ఎంటీపీడీ యూనిట్ల యూరియా ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. గ్యాస్ ఆధారితంగా నిర్మించే ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తారు.

1,600 మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంట్
పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. మొదటి దశలో (800్ఠ2) 1,600 మెగావాట్ల ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాంగణంలోనే రూ.10,598 కోట్ల ఖర్చుతో చేపట్టే ఈ విద్యుత్ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్
హైదరాబాద్-కరీంనగర్ జిల్లాలను కలిపే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మించాలనేది ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్. ఎట్టకేలకు ప్రధాని గజ్వేల్ సభలో ఈ పనులకు పునాదిరాయి వేయనున్నారు. రూ.1,160 కోట్ల ఖర్చుతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఇప్పటికే గజ్వేల్ వరకు 900 ఎకరాల మేరకు భూసేకరణ పూర్తి చేసి రైల్వేకు అప్పగించారు. మొత్తం 150 కిలోమీటర్ల పొడవుండే ఈ లైన్‌ను మూడేళ్లలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మనోహరాబాద్ (మేడ్చల్) నుంచి గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా ఈ లైన్ కరీంనగర్ (కొత్తపల్లి)కు చేరుతుంది.

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం
విభజనలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పేరుతో వరంగల్ కేంద్రంగా ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
 
 
ప్రత్యేక ఏర్పాట్లు
సభా స్థలంలో 1.5 లక్షల మందికి సరిపోయేలా రెయిన్  ప్రూఫ్ టెంట్లు, మరో 50వేల మందికి సరిపోయేలా సాధారణ టెంట్లు వేశారు. 160 ఎకరాలను ఎనిమిది సెక్టార్లుగా విభజించి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. జనాన్ని తరలించేం దుకు 4,500 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. 4 వేల మందికిపైగా కేంద్ర, రాష్ట్ర బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను శనివారం బండారు దత్తాత్రేయ, హరీశ్‌రావు పరిశీలించారు. స్వల్ప మార్పులు, చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు.
 
వేదికపై పరిమిత సంఖ్యలో..

ప్రధాని ప్రసంగించే ప్రధాన వేదికపై దాదాపు 20 మంది ప్రముఖులు మాత్రమే ఉండనున్నారు. ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, పీయూష్ గోయల్, అనంత్‌కుమార్, బండారు దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, పి.మహేందర్‌రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, మెదక్ జెడ్పీ చైర్‌పర్సన్ రాజారాణి తదితరులు వేదికపై ఉంటారు. ఇక కుడివైపు ఏర్పాటు చేసిన మరో వేదికపై మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్ పర్సన్లు, మేయర్లు, ఇతర ముఖ్యులు ఉంటారు. ఎడమ వైపు వేదికపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధిపతులు కూర్చుంటారు. ఇక ముగ్గురు మాత్రమే ప్రసంగించనున్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతోపన్యాసం చేస్తారు. తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడాక.. ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. చివరగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వందన సమర్పణ చేస్తారు. అనంతరం ప్రధాని హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

మరిన్ని వార్తలు