కేసీఆర్‌ వెంటనే చర్యలు చేపట్టాలి: వీహెచ్‌

5 Mar, 2020 11:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ 14లోగా పంజాగుట్టలో విగ్రహాన్ని ప్రతిష్టించనట్లయితే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఎంపీలు, మాజీ ఎంపీలు ధర్నాకు దిగారు. సీనియర్‌ నేత వీహెచ్‌ నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మల్లు రవి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు అడ్డుపడి ఆయన విగ్రహాన్ని పోలీస్ స్టేషన్‌లో ఉంచడం అవమానకరం. అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు సీఎం చర్యలు తీసుకోవాలి. పంజాగుట్టలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలి. లేదంటే మా పోరాటం మరింత ఉధృతమవుతుంది’’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు