ఇదీ కాంగ్రెస్‌.. నవాజ్‌ షరీఫ్‌ మూమెంట్‌!

13 May, 2018 17:56 IST|Sakshi
కేం‍ద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

చిదంబరంపై ఆ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు

నిలదీసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విదేశీ ఆస్తుల విషయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేశారు. తన విదేశీ ఆస్తులను వెల్లడించడంలో విఫలమైనా చిదంబరంపై కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె నిలదీశారు. చిదంబరం విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడాన్ని కాంగ్రెస్‌ పార్టీ ‘నవాజ్‌ షరీఫ్‌ మూమెంట్’గా ఆమె అభివర్ణించారు. ఆయన ఆర్థిక అవకతవకలను కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. తన కుటుంబం విదేశీ ఆస్తులను వెల్లడించే విషయాన్ని చిదంబరం ఎందుకు మరిచిపోయారో వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. ‘పలు కేసుల్లో స్వయంగా బెయిల్‌ మీద ఉన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన పార్టీకి సంబంధించిన నేతపై విచారణ జరుపుతారో లేదో వెల్లడించాలి’ అని ఆమె పేర్కొన్నారు.

‘చిదంబరం విదేశీ పెట్టుబడుల వివరాల్ని పన్ను విభాగానికి వెల్లడించలేదు. ఇది నల్లధన చట్టాన్ని ఉల్లంఘించడమే. నల్లధనాన్ని నిరోధించేందుకు మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం కింద విదేశాల్లో రహస్యంగా అక్రమ సంపదను దాచిపెట్టే భారతీయులను విచారించవచ్చు’ అని ఆమె తెలిపారు. విదేశాల్లో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నందకు, వాటి వివరాలు వెల్లడించనందకే పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు నవాజ్‌ షరీఫ్‌ను ఆ దేశ సుప్రీం కోర్టు ప్రధాని పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు దేశానికి, కాంగ్రెస్‌ పార్టీకి చిందబరం వ్యవహారం నవాజ్‌ షరీఫ్‌ వ్యవహారంలా తయారైందని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఈ నెల 11న చెన్నై సిటీ కోర్టులో చిదంబరం భార్య నళిని, కుమారుడు కార్తీ, అతని భార్య శ్రీనిధిపై ఐటీ చట్టం 2015 సెక్షన్‌ 50 కింద కేసులు నమోదైనట్టు తెలిపారు.

విదేశి ఆదాయం, ఆస్తుల వివరాలు వెల్లడించనందకే ఈ కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. యూకేలోని కేంబ్రిడ్జ్‌లో 5.37 కోట్ల ఆస్తులు, వేరే చోట 80 లక్షల ఆస్తులు, అమెరికాలో 3.28 కోట్ల ఆస్తులు వంటి వెల్లడించని ఆస్తులు కలిగి ఉన్నందకే ఆయనపై చార్జ్‌ షీట్‌ నమోదైందని తెలిపారు. ఆయన కుమారుడు కార్తీ అమెరికాలోని నానో హోల్డింగ్స్‌ ఎల్‌ఎల్‌సీలో 3.28 కోట్ల, 80 లక్షల పెట్టుబడులు కలిగి ఉన్నట్టు ఆదాయ పన్ను చట్టం, నల్లధన చట్టం కింద నమోదైన చార్జ్‌ షీట్‌లో పేర్కొని ఉందని తెలిపారు. చిదంబరం ఆయన కుటుంబ సభ్యుల అక్రమ ఆస్తులు 14 దేశాలు, 21 విదేశి బ్యాంకుల్లో ఉన్నాయని, వాటి విలువ దాదాపు మూడు బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనిపై చిదంబరం వివరణ ఇస్తూ.. సీతారామన్‌ వ్యాఖ్యలపై తాను స్పందించనని, ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉందని నిజానిజాలు అక్కడే తెలుస్తాయని అన్నారు.

మరిన్ని వార్తలు