సంకీర్ణ సర్కార్‌కు ఢోకా లేదన్న కాంగ్రెస్‌, జేడీఎస్‌

16 Jan, 2019 16:11 IST|Sakshi

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు వేగవంతం చేస్తుంటే తమ సంకీర్ణ సర్కార్‌కు ఎలాంటి ముప్పూ లేదని జేడీఎస్‌, కాంగ్రెస్‌ నేతలు బుధవారం ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇప్పటికే కుమారస్వామి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకోగా 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించవచ్చనే ప్రచారం సాగుతోంది. మరోవైపు బీజేపీ తన ఎమ్మెల్యేలతో గురుగ్రామ్‌లోని రిసార్ట్స్‌లో క్యాంప్‌ నిర్వహిస్తోంది. కర్ణాటకలో పరిణామాలు అనూహ్యంగా మారుతున్నా జేడీఎస్‌, కాంగ్రెస్‌ నేతలు పరిస్థితి తమ అదుపులోనే ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ముంబై హోటల్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని, వారు తిరిగివచ్చి తమతో కలుస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. తాను రిలాక్స్డ్‌గా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు గురుగ్రామ్‌లోని రిసార్ట్‌ వెలుపల ఆందోళన చేపట్టారు. ఇక కుమారస్వామి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించిన ఇద్దరు స్వతం‍త్ర ఎమ్మెల్యేలకు ఏ పార్టీతో సంబంధం లేదని, ఇది చిన్న విషయమని దీనికి ఏమంత ప్రాధాన్యం లేదని జేడీఎస్‌ చీఫ్‌, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లో ఎలాంటి అంతర్గత పోరు లేదని, ముంబై హోటల్‌లో ఉన్న ఎమ్మెల్యేలందరితో తాను సంప్రదింపులు జరుపుతున్నానని కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ చెప్పారు. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్ధానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా, వరుసగా 79, 37 స్ధానాలు గెలుపొందిన కాంగ్రెస్‌, జేడీఎస్‌లు బీజేపీకి చెక్‌ పెట్టేందుకు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

18న సీఎల్పీ భేటీ
కుమారస్వామి సర్కార్‌ను కూలదోసేందుకు ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు సాగిస్తోందనే ప్రచారం నేపథ్యంలో తమ శాసనసభ్యులను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ సంసిద్ధమైంది. పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ గూటికి చేరకుండా అడ్డుకునేందుకు ఈనెల 18న సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. సీఎల్పీ నేత సిద్ధరామయ్య అధ్యక్షతన ఈనెల 18న విధాన సౌధలో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని సిద్ధరామయ్య కార్యాలయం బుధవారం ఓ ప్రకటన చేసింది.

మరిన్ని వార్తలు