కరోనా: పరిస్థితులు చేజారిపోయాయా..!

8 Jul, 2020 16:28 IST|Sakshi

లక్షల్లో పాజిటివ్‌ కేసులు 

రెండు వేలకు చేరువలో మరణాలు 

నిర్ధారణ కాలేదన్న సీఎం ఎడపాడి 

అధ్యయనం కోసం నేడు కేంద్ర బృందాల రాక 

కరోనా వైరస్‌ను అదుపుచేసే పరిస్థితులు చేజారిపోయాయా? సాధారణ వ్యాప్తిని దాటిపోయి సామూహిక వ్యాప్తి దశకు చేరుకుందా? అంటే అవునని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నిర్ధారణ కాలేదని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మంగళవారం ప్రకటించగా ఇదే అంశాన్ని నిర్ధారించేందుకు కేంద్ర వైద్య బృందం బుధవారం తమిళనాడుకు చేరుకుంటోంది. 

సాక్షి, చెన్నై: కరోనా వైరస్‌పై కేంద్రం జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ విధించడానికి ముందే కరోనా వైరస్‌పై అప్రమత్తమైనట్లు తమిళనాడు ప్రభుత్వం అనేక సార్లు చెప్పుకుంది. కేంద్ర మార్గదర్శకాలతోపాటు అదనంగా 144 సెక్షన్‌ కూడా విధించి లాక్‌డౌన్‌ను అమలు చేసింది. కరోనా వైరస్‌ కట్టడి చర్యలపైనే ప్రధానంగా సీఎం ఎడపాడి పలుమార్లు అధికారులతో, వైద్య నిపుణులతో సమావేశమయ్యారు. కరోనా వైరస్‌ నుంచి ప్రజలను కాపాడేందుకు ఆరోగ్యశాఖ కృషి చేస్తుండగా, మాస్క్‌ ధరింపజేయడం, భౌతికదూరం పాటించనివారిపై కొరడా ఝుళిపించడం వంటి చర్యలతో పోలీస్‌ శాఖ సైతం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇంత చేసినా రాష్ట్రంలో కరోనా ప్రజలను భయపెట్టే స్థాయికి చేరుకుంది. పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. చదవండి: మాల్‌లో కరోనా రోగి : భారీ జరిమానా 


గురువారం నాటి గణాంకాల ప్రకారం 3,616 కొత్త పాజిటివ్‌ కేసులతో మొత్తం 1,18,594కు చేరుకుంది.  4వేల అంకె నుంచి 3వేల అంకెకు దిగివచ్చింది. మరణాల సంఖ్య 1,636కు పెరిగింది. చెన్నై పేరు చెబితే జనం జడుసుకునే రీతిలో ఈనెల 3వ తేదీ వరకు పెరిగిపోతుండిన పాజిటివ్‌ కేసులు అదృష్టవశాత్తు తగ్గుముఖం పట్టాయి. చెన్నైలో 3వ తేదీన 2,082 కేసులు బయటపడగా, 4వ తేదీన 1,842, 5వ తేదీన 1,713, 6వ తేదీన 1,747, మంగళవారం నాడు 1,203.. ఇలా రెండు వేల సంఖ్య నుంచి దిగివస్తోంది. అయినా సామాజిక వ్యాప్తి దశకు చేరుకున్నట్లు ప్రజలు భయానికి లోనై ఉన్నారు. సామాజిక వ్యాప్తిపై అధికారిక నిర్ధారణ జరగలేదని సీఎం స్పష్టం చేశారు. ఈ గందరగోళం నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర వైద్యబృందం బుధవారం తమిళనాడుకు చేరుకుంటోంది. కరోనా వ్యాప్తిపై అధ్యయనం చేసి సామాజిక వ్యాప్తిలోకి రాష్ట్రం ప్రవేశించిందా లేదా అని నిర్ధారించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: హోం క్వారంటైన్‌లోకి జార్ఖండ్‌ సీఎం

మరిన్ని వార్తలు