ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం

19 Jul, 2019 08:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రజలపై పన్ను భారం తగ్గించడం, మరిన్ని సౌకర్యాలు కల్పించడమే బడ్జెట్‌ ప్రతిపాదనల లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం లోక్‌సభకు తెలిపారు. అయితే, పెట్రోల్, డీజిల్‌పై సెస్‌తోపాటు, క్యాష్‌ విత్‌డ్రాయల్స్‌పై 2 శాతం టీడీఎస్‌ ఎత్తివేయాలంటూ ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను మాత్రం ఆమె తిరస్కరించారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సాధనకు ఈ బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు.

కాగా, చట్టపరమైన కార్యక్రమాలు మిగిలి ఉన్న దృష్ట్యా పార్లమెంట్‌ సమావేశాలను రెండు, మూడు రోజులు పొడిగించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ‘పార్లమెంట్‌ సమావేశాలను రెండు లేక మూడు రోజులపాటు పొడిగించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశంపై బీజేపీ నేతలు ప్రతిపక్షాలతో చర్చించనున్నారు’ అని అధికార వర్గాలు తెలిపాయి. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 17వ తేదీన మొదలైన 17వ లోక్‌సభ సమావేశాలు ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు