నాలుగు రోజుల్లో 110 మంది

30 Sep, 2019 03:50 IST|Sakshi
పట్నాలో వరద నీటిలో మూటాముల్లె సర్దుకుని వస్తున్న ప్రజలు

దేశ వ్యాప్తంగా భారీ వర్షాలకు మృత్యువాత

వరదల్లో చిక్కిన పట్నా నగరం

న్యూఢిల్లీ: నాలుగు రోజులుగా దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో 110 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అత్యధికులు ఉత్తరప్రదేశ్‌ వారు కాగా, ఎడతెగని వానలతో బిహార్‌ రాజధాని పట్నాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. రుతుపవనాల తిరోగమనం తీవ్రంగా ఆలస్యం కావడంతో బిహార్‌ సహా పలు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. పట్నాలోని చాలా ప్రాంతా ల్లో నడుము లోతు వరద నీరు నిలిచిపోయింది. లోతట్టు నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నిత్యావసరాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో గత 48 గంటల్లో చోటుచేసుకున్న వివిధ ఘటనల్లో 18 మంది చనిపోయారు. చాలా ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు, వైద్య సేవలు, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయాయి. శుక్రవారం నుంచి రాష్ట్రంలో అనూహ్యం గా 200 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పట్నా, దనపూర్‌ తదితర రైల్వే స్టేషన్లు వరదల్లో చిక్కుకుపోవడంతో రైల్వే శాఖ 30 రైళ్లను రద్దు చేసింది. కొన్ని విమానసర్వీసులను కూడా దారి మళ్లించారు. గురువారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా.. ఉత్తరప్రదేశ్‌ లో 79 మంది, గుజరాత్‌లో ముగ్గురు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో కలిపి 13 మంది మృతి చెందారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పొంగిపొర్లుతున్న నదిలో బీఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరితోష్‌ మండల్‌ కొట్టుకుపోయారు. 36వ బెటాలియన్‌కు చెందిన మండల్‌ కోసం అధికారులు గాలిస్తున్నారు

మరిన్ని వార్తలు