‘ఉగ్రవాదిని కాదు.. లాహోర్‌ నుంచి రాలేదు’

13 Jun, 2017 13:54 IST|Sakshi
‘ఉగ్రవాదిని కాదు.. లాహోర్‌ నుంచి రాలేదు’

న్యూఢిల్లీ: ‘నేనేం ఉగ్రవాదిని కాదు.. లాహోర్‌ నుంచి రాలేదు’అని పటేల్‌ ఉద్యమకారుడు హార్దిక్‌ పటేల్‌ తనను అరెస్టు చేసిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తనను అరెస్టుచేయాల్సిన అవసరం ఏమిటని, తాను కూడా ఈ భారతదేశ పౌరుడినే అని చెప్పిన ఆయన తనకు ఎక్కడైనా సంచరించే హక్కు ఉందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులు చోటుచేసుకున్న మాంద్‌సౌర్‌ ప్రాంతానికి హార్దిక్‌ వెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారు.

తమ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించడంతోపాటు పంటరుణాలు ఇప్పించాలని, పాత రుణాలు మాఫీ చేయాలని ఉద్యమం చేస్తున్న రైతులపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తలు నెలకొని ఆంక్షలు ఉన్నాయి. అక్కడికి ఎవరినీ అనుమతించడం లేదు. మంగళవారం అక్కడి వెళుతున్న హార్దిక్‌ను అరెస్టు చేస్తున్న సందర్భంలో ఈ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేనేం ఉగ్రవాదిని కాదు.. నేనేం లాహోర్‌ నుంచి ఇక్కడికి రాలేదు. నేను భారతీయుడ్ని. నాకు ఈ దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు ఉంది’ అంటూ ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

మరిన్ని వార్తలు