ఉగ్రవాదంపై గట్టిగా స్పందించాలి

1 Dec, 2019 04:51 IST|Sakshi
జపాన్‌ మంత్రితో మోదీ సమావేశం

పాకిస్తాన్‌ను కోరిన భారత్, జపాన్‌

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర ముఠాలు ఈ ప్రాంతంలో శాంతికి ముప్పుగా మారాయని, వాటిని కట్టడి చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని భారత్, జపాన్‌ ఆ దేశాన్ని కోరాయి. ఇరు దేశాల రక్షణ, విదేశాంగశాఖ మంత్రుల స్థాయి వార్షిక భేటీ అనంతరం ఈ మేరకు ప్రకటించాయి. ఉగ్రవాదంపై పోరాడే విషయంలో ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) సహా అంతర్జాతీయ విభాగాలకు ఇచ్చిన హామీలను పాక్‌ అమలు చేయాలని ఇరు దేశాలు కోరాయి.

ఈ భేటీలో భారత్‌ తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జై శంకర్, జపాన్‌ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి తొషిమిట్సు మొటెగి, రక్షణ మంత్రి టారో కొనో పాల్గొన్నారు. తర్వాత జపాన్‌ మంత్రులు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఇండో–పసిఫిక్‌లో శాంతి, సుస్థిరతలను నెలకొల్పేందుకు జపాన్, భారత సంబంధాలు కీలకమైనవని మోదీ అన్నారు. వచ్చే నెలలో జరగనున్న ఇండో–జపాన్‌ వార్షిక సదస్సుకు ప్రధాని షింజో ఆబేను ఆహ్వానించనున్నట్లు మోదీ తెలిపారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

దేశ అభివృద్ధికి మరింత కృషి
కేంద్రంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా మోదీ శనివారం ట్విట్టర్‌ వేదికగా తన స్పందనను తెలిపారు. ‘6 మంత్స్‌ ఆఫ్‌ ఇండియా ఫస్ట్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో పలు ట్వీట్లు చేశారు. రానున్న కాలంలో సుసంపన్న, ప్రగతిశీల, సరికొత్త భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సబ్‌ కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌ కా విశ్వాస్‌ నినాదం స్ఫూర్తితో, ఎన్డీయే ప్రభుత్వం భారత్‌ అభివృద్ధికి తన కృషిని కొనసాగిస్తోందన్నారు.

మరిన్ని వార్తలు