ఇస్రో ప్రయోగం అద్భుతం

27 Feb, 2017 01:24 IST|Sakshi
ఇస్రో ప్రయోగం అద్భుతం

ఒకేసారి 104 ఉపగ్రహాల ప్రయోగంతో దేశానికి కీర్తి ప్రతిష్టలు
♦ దేశానికి మరింత మంది శాస్త్రవేత్తలు అవసరం
♦ రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తిలో రైతుల కృషి అభినందనీయం
♦ అవినీతి వ్యతిరేక పోరులో ‘డిజిటల్‌’ది కీలక పాత్ర
♦ ‘మన్  కీ బాత్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ


న్యూఢిల్లీ: సామాన్యులకు సాంకేతిక ప్రయోజన లబ్ధి చేరువయ్యేందుకు దేశంలో మరింతమంది శాస్త్రవేత్తల అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ‘మన్  కీ బాత్‌’లో భాగంగా ఆదివారం రేడియోలో ప్రసంగిస్తూ... ఒకేసారి 104 ఉపగ్రహాల్ని ప్రయోగించి రికార్డు సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి అభినందనీయమన్నారు. అంగా రక గ్రహంపైకి మంగళయాన్ గం తర్వాత అంతరిక్ష చరిత్రలో ఇస్రో ప్రపంచ రికార్డు లిఖించిందని కొనియాడారు.

‘పీఎస్‌ఎల్వీ రాకెట్‌ 38వ విజయవంత ప్రయోగంలో 104 ఉపగ్రహాల్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడం అభినందనీయం. ఇస్రో శాస్త్రవేత్తలు దేశానికి ఎంతో కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టారు. ఇస్రో బృందంలో ఎంతో మంది యువ శాస్త్రవేత్తలతో పాటు మహిళలు కూడా ఉన్నారు.  పీఎస్‌ఎల్వీ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లో కార్టోశాట్‌ 2డీ ఒకటి... అది ఇప్పటికే పనిచేయడం మొదలుపెట్టింది. పట్టణాభివృద్ధి కోసం వనరులు, మౌలిక వసతుల్ని గుర్తించడం, ప్రణాళికలు రూపొందించేందుకు అది ఉపయోగపడుతుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.

యువతలో సైన్స్  పట్ల ఆసక్తి పెరగాలి
బాలాసోర్‌ నుంచి బాలిస్టిక్‌ క్షిపణి నిరోధక పరీక్ష విజయవంతమవడాన్ని కూడా ప్రధాని ప్రశంసించారు. ‘ఆ క్షిపణికి భూతలం నుంచి 100 కి.మీ. ఎత్తులో శత్రువుల క్షిపణుల్ని నాశనం చేయగల సామర్థ్యముంది. ప్రపంచంలో కేవలం నాలుగైదు దేశాల వద్ద మాత్రమే అలాంటి సామర్థ్యం ఉంది’ అని పేర్కొన్నారు. యువతరంలో సైన్స్  పట్ల ఆసక్తి పెరగాలని మోదీ అభిలషించారు. సామాన్యుల అవసరాల మేరకు సైన్సు ఉపయోగపడితే అప్పుడది మానవజాతికి ఎంతో విలువైన సాధనం అవుతుందని చెప్పారు.

ప్రజోపయోగ ఆవిష్కరణలు అవసరం
ఇటీవల జరిగిన 14వ ప్రవాసీ భారతీయ దివస్‌ పోటీల్ని ప్రధాని గుర్తు చేశారు. ‘ప్రవాసీ భారతీయ దివస్‌లో ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణల్ని ప్రదర్శించారు. మత్స్యకారులకు ఉపయోగపడేలా చేపలు ఎక్కడ ఎక్కువ ఉంటాయో తెలియచెప్పే పరికరం అందులో ఒకటి. వాతావరణ సమాచారంతో పాటు, సముద్రంలో మార్పుల సమాచారం కూడా అందిస్తుంది. పరిష్కారం కోసం సైన్సు ఎంత ముఖ్యమైందో... ఎన్నో సార్లు ఆ సమస్యలే చాటి చెప్పాయి. అందుకు 2005 ముంబై వరదలే ఉదాహరణ.. వరదల అనంతరం ప్రజల ప్రాణాలకు హాని జరగకుండా, వరద నీరు నిల్వ ఉండకుండా నివాస గృహాల నిర్మాణాల్ని చేపట్టార’ని మోదీ గుర్తుచేశారు.

రికార్డు స్థాయిలో ఆహారోత్పత్తి: ఈ ఏడాది రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తి సాధించిన రైతుల కృషిని కొనియాడారు. ‘రైతులు మన ధాన్యాగారాల్ని నింపేందుకు ఎంతో కష్టపడ్డారు. వారి శ్రమ ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రికార్డు సాధన సాధ్యపడింది. ఈ ఏడాది 2,700 లక్షల టన్నుల ఆహార ధాన్యాల్ని ఉత్పత్తి చేశారు. గతేడాది రైతులు సాధించిన రికార్డు కంటే ఇది 8 శాతం అదనం. పేదల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని రైతులు వేర్వేరు రకాల పప్పు దినుసుల్ని సాగుచేశారు’ అంటూ ప్రశంసలు కురిపించారు. మహిళ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ.. క్రీడలు, అంతరిక్ష విజ్ఞానం ఇలా రంగమేదైనా మహిళలు వెనకంజలో ఉండకూడదన్నారు.

నగదు వాడకం తగ్గుముఖం పడుతోంది
డిజిటల్‌ చెల్లింపుల విధానం నల్లధనానికి అడ్డుకట్ట వేస్తుందని, అవినీతి వ్యతిరేక పోరులో కీలక పాత్ర పోషిస్తుందని మోదీ పేర్కొన్నారు. ‘యువత అవినీతి వ్యతిరేక సభ్యులుగా మారాలి. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్‌ చెల్లింపుల పథకాలకు యువత ప్రచార కర్తలుగా మారాలి. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలి. నల్లధనం, అవినీతికి వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించే డిజిటల్‌ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

నగదుపై ఆధారపడే మనస్తత్వాన్ని ప్రజలు క్రమంగా వదులుకుంటున్నారు. డిజిటల్‌ కరెన్సీ వైపు అడుగులు వేస్తున్నారు. చెల్లింపుల కోసం యువత వారి మొబైల్‌ ఫోన్లను కొత్త సాధనంగా వినియోగిస్తూ ఈ విధానాన్ని ముందుకు నడిపిస్తున్నారు. గత రెండు నెలల్లో 10 లక్షల మంది ప్రజలకు ప్రోత్సాహకాలు ఇచ్చాం. 50 వేల మంది వర్తకులు బహుమతులు గెలుచుకున్నారు. డిజిటల్‌ చెల్లింపు పథకాలు వినియోగించే వారికి ప్రోత్సాహకాలు ఏప్రిల్‌ 14తో ముగుస్తాయి. ప్రతి ఒక్కరూ 125 మందికి భీమ్‌ యాప్‌ డౌన్ లోడ్‌ చేసుకునేలా సాయం చేయాలి’ అని మోదీ కోరారు.

మరిన్ని వార్తలు