అమ్మకు విగ్రహం

9 Feb, 2018 08:49 IST|Sakshi

రాయపేటలో ప్రతిష్టకు చర్యలు

24న ఆవిష్కరణ 8 శరవేగంగా పనులు

సాక్షి, చెన్నై : దివంగత సీఎం అమ్మ జయలలితకు నిలువెత్తు విగ్రహం అన్నాడీఎంకే నేతృత్వంలో చెన్నై రాయపేటలో ఏర్పాటు కానుంది. పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో దివంగత నేత ఎంజీఆర్‌ విగ్రహం పక్కనే అమ్మ విగ్రహం ఏర్పాటు పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. 

పురట్చి తలైవీగా అన్నాడీఎంకే వర్గాల అమ్మగా తమిళుల హృదయాల్లో సుస్తిర స్థానం సంపాదించుకున్న జయలలిత అందర్నీ వీడి అనంత లోకాలకు వెళ్లి ఏడాది దాటింది. అమ్మ మరణంతో అన్నాడీఎంకే ముక్కలైనా, అమ్మ పాలన మాత్రం రాష్ట్రంలో సాగుతూ వస్తున్నది. అమ్మ నివాసాన్ని స్మారక మందిరంగా, అమ్మ సమాధి పరిసరాల్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు తగ్గ పనులకు పాలకులు శ్రీకారం చుట్టారు. అయితే, అమ్మకు పార్టీ తరఫున ఇంత వరకు ఎలాంటి విగ్రహం ఏర్పాటు కాలేదు. కోయంబత్తూరులో ఇటీవల మంత్రి ఎస్పీ వేలుమణి తన పలుకుబడి చాటే దిశలో దివంగత నేతలు అన్నా, ఎంజీఆర్‌ విగ్రహాల వరసలో అమ్మ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో రాష్ట్ర పార్టీ కార్యాలయ ఆవరణలో అమ్మకు విగ్రహం ఏర్పాటు చేయాలని కేడర్‌ నినదించారు. వారి కళను సాకారం చేసే విధంగా ఈ ఏడాది ప్రధాన కార్యాలయంలో అమ్మ విగ్రహం ప్రతిష్టించేందుకు చర్యలు తీసుకున్నారు. 

జయకు విగ్రహం : రాయపేటలోని అవ్వై షణ్ముగం సాలైలో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఉంది. నిత్యం కేడర్‌ రాకపోకలతో ఇక్కడ వాతావరణం సందడిగానే ఉంటుంది.  ఇక్కడ పార్టీ జెండా స్తూపం, ఆ పక్కనే దివంగత నేత ఎంజీఆర్‌ నిలువెత్తు విగ్రహం ఉంది. ఇక్కడే అమ్మకు సైతం విగ్రహం ఏర్పాటుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నిర్ణయ తీసుకుంది. ఇందుకు తగ్గ పనులకు ఉదయాన్నే శ్రీకారం చుట్టారు. ఎంజీఆర్‌ విగ్రహానికి పక్కనే ఉన్న జెండా స్తూపాన్ని తొలగించారు. అక్కడ అమ్మ విగ్రహం ప్రతిష్టకు తగ్గ గోతిని తవ్వారు. ఇక్కడ అమ్మ నిలువెత్తు విగ్రహాన్ని కొలువు దీర్చేందుకు పనుల వేగం పెంచారు. నిర్మాణ పనుల్లో ఎంజీఆర్‌ విగ్రహానికి ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా దానిని భద్ర పరిచారు. అలాగే, విగ్రహ ప్రతిష్ట జరగనున్న ప్రాంతం చుట్టూ కంచెను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ పనులు పది రోజుల్లో ముగించేందుకు నిర్ణయించారు. ఈనెల 24వ తేదీన అమ్మ జయలలిత జయంతి కావడంతో, ఆరోజున అశేషాభిమాన అన్నాడీఎంకే కేడర్‌ సమక్షంలో విగ్రహాన్ని ఆ పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షుడు పన్నీరుసెల్వం, ఉపాధ్యక్షుడు పళని స్వామి ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర పార్టీ  కార్యాలయం ఆవరణలో అమ్మకు నిలువెత్తు విగ్రహం ఏర్పాటు కానుండడంతో కేడర్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు