బనానా లెక్క తీరింది.. హోటల్‌కు బొక్క పడింది!

28 Jul, 2019 16:31 IST|Sakshi

రాహుల్‌ బోస్‌ బనాన బిల్లుపై స్పందించిన ఎక్సైజ్‌-పన్నుల శాఖ

మారియట్‌ హోటల్‌కు రూ.25వేల జరిమానా

చంఢీగడ్‌ : బాలీవుడ్‌ నటుడు రాహుల్‌ బోస్‌ బనానా లెక్క తీరింది. రెండు అరటిపళ్లకు జీఎస్టీ అంటూ రూ.442.50 బిల్లు వేసారని అతను చేసిన ట్వీట్‌పై ఎక్సైజ్‌-పన్నుల శాఖ స్పందించింది. రెండు అరటి పళ్లకు రూ.442 వసూలు చేసిన జేడబ్ల్యూ మారియట్ హోటల్‌పై చర్యలు తీసుకుంది. జీఎస్టీ పరిధిలోకి రాని అరటిపళ్లపై జీఎస్టీ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రూ.25వేల జరిమానా విధించింది. చండీగఢ్‌లో ఉన్ జేడబ్ల్యూ మారియట్ హోటల్లో నటుడు రాహుల్ బోస్ జిమ్‌ చేసిన అనంతరం రెండు అరటిపళ్లు తిన్నాడు.

అయితే ఆ అరటి పళ్ల బిల్లు చూసి కళ్లు తేలేసాడు. ఆ రెండు అరటిపళ్లకు హోటల్ యాజమాన్యం జీఎస్టీతో కలపి ఏకంగా రూ.442.50 బిల్లు వేసింది. ‘పండ్లు కీడు చేయవని ఎవరు చెప్పారు? ఇదే ఉదాహరణ.’  అంటూ  ఆ బిల్లును తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది నెట్టింట తెగహల్‌చల్‌ చేసింది. ఆ హోటల్ మీద నెటిజన్లు విరుచుకుపడ్డారు. హోటల్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుండటంతో మారియట్ యాజమాన్యం కూడా స్పందించింది. దీనిపై విచారణ జరుపుతామని చెప్పింది. అయితే, ఆ బిల్లును చూసిన ఎక్సైజ్ పన్నుల శాఖ.. అరటి పళ్లకు కూడా జీఎస్టీ వేసినట్టు గుర్తించింది. 9శాతం జీఎస్టీ వేసినట్టు బిల్లులో గుర్తించి ఆ హోటల్‌పై రూ.25వేల జరిమానా వేసింది.

చదవండి: బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..! 

మరిన్ని వార్తలు