లాక్‌డౌన్‌ సడలింపు : తెరుచుకోనున్న పరిశ్రమలు

30 Apr, 2020 19:05 IST|Sakshi

ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పని..

బెంగళూర్‌ : లాక్‌డౌన్‌ నియంత్రణలను సడలించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు అనుమతిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు, భారీ, చిన్న మధ్యతరహా సంస్థలు పనిచేసేందుకు అనుమతించనున్నట్టు తెలిపింది. ఐటీ సంస్థలు మాత్రం తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయడాన్ని కొనసాగించాలని పేర్కొంది. మరో మూడు నెలలు కోవిడ్‌-19 ప్రభావం ఉంటుందని అప్పటి వరకూ నియంత్రణలతో కూడిన సడలింపులు ఉంటాయని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప పేర్కొన్నారు.

అన్ని పరిశ్రమలు మే 4 నుంచి తిరిగి పనిచేసేందుకు అనుమతిస్తామని, మాస్క్‌లు ధరించడం..సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని పరిశ్రమల మంత్రి జగదీష్‌ షెట్టార్‌ చెప్పారు. మే 4 నుంచి 50 శాతం సిబ్బందితో ఆయా పరిశ్రమలు పనిచేసేందుకు అనుమతిస్తామని అన్నారు. ప్రజా రవాణా రాకపోకలను అనుమతించలేదని, సిబ్బంది ప్రైవేట్‌ వాహనాలు లేదా కంపెనీలు ఏర్పాటు చేసిన వాహనాలను ఉపయోగించుకోవాలని చెప్పారు. బస్సులు, రైళ్లు వాహనాల రాకపోకలకు అనుమతి లేనందున కార్మికుల రవాణా ఆయా సంస్థల బాధ్యతేనని స్పష్టం చేశారు. మే 3 తర్వాత కూడా మాల్స్‌, సినిమా థియేటర్లను అనుమతించడం లేదని మంత్రి తెలిపారు.

చదవండి : క్వారంటైన్‌లో న‌లుగురు క‌ర్ణాట‌క మంత్రులు

ఇక సెలూన్లు, బ్యూటీపార్లర్లను తెరవడంపై మే 3 తర్వాత కేంద్రప్రభుత్వ తాజా మార్గదర్శకాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మద్యం విక్రయాల పైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కేంద్రం మార్గదర్శకాల కోసం వేచిచూస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్ధులు, వలస కూలీల రాకపోకలను అనుమతిస్తామని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఇక సిమెంట్‌, స్టీల్‌ షాపులు తెరుచుకుంటాయని, క్రషర్స్‌ పనిచేస్తాయని పేర్కొంది. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు కూడా పనిచేస్తాయని, కార్యాలయానికి ఎలాంటి పనుల కోసం వచ్చే వారికి వాట్సాప్‌ ద్వారా పాస్‌లు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు