రాజ్యసభకు కేజ్రీవాల్‌?!

30 Dec, 2017 14:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీకి రాజ్యసభ సభ్యుల ఎంపిక పెను సవాలును విసురుతోంది. అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్న సంఖ్యాబలంతో ముగ్గురిని పెద్దల సభకు పంపవచ్చు. ఇప్పటివరకూ రెండు స్థానాలకుగాను పార్టీ నేతలైన ఆశుతోష్‌, సంజయ్‌ సింగ్‌ల పేర్లును ఆ పార్టీ పరిశీలిస్తోంది. దాదాపు వీరి పేర్లే ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఇక మూడో అభ్యర్థి విషయంలోనే పేచీ ఉంది.  ఈ సీటును ఒక ప్రొఫెసర్‌ను పంపాలని మొదట నుంచి కేజ్రీవాల్‌ ఆలోచిస్తున్నారు. అయితే అది వాస్తవరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తానే మూడో అభ్యర్థిగా పోటీ చేయాలనే భావనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలావుండగా.. రాజ్యసభకు నామినేషన్ల గడువు శనివారంతో మొదలై, జనవరి 5తో ముగుస్తుంది. జనవరి 16న ఎన్నికలు జరుగుతాయి. 

ఆప్‌ను వెంటాడుతున్న తిరస్కరణలు
మూడో అభ్యర్థి విషయంలో ఆప్‌ అధినేత కొంతకాలంగా డైలమాలో ఉన్నారు. మూడో అభ్యర్తిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ను నిలబెట్టేందుకు ఆప్‌ ఆసక్తి చూపింది. ఈ విషయంపై ఠాకూర్‌తో కేజ్రీవాల్‌ ప్రత్యేకంగా సమావేశమ్యారు. ఈ సమావేశంలోనే ఆప్‌ సూచనను ఆయన సున్నితంగా తిరస్కరించారు.  

మాజీ ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా, మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌ శౌరి, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు ఆర్‌ నారాయణ మూర్తి, నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాష్‌ సత్యార్థిలను కూడా ఆప్‌ సంప్రదించింది. అయితే వారంతా రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని సున్నింతగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఇక మూడో అభ్యర్థిగా తానే పోటీ చేయాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

కుమార్‌ విశ్వాస్‌కు నో ఛాన్స్‌
ఆప్‌ సీనియర్ నేత కుమార్ విశ్వాస్‌ను మాత్రం రాజ్యసభ అభ్యర్థిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక చేయపోవచ్చని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తో ఆ మధ్య పలు సందర్భాల్లో కుమార్ విశ్వాస్ విభేదించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. 

>
మరిన్ని వార్తలు