కేరళ గోల్డ్‌ స్కామ్‌: కీలక విషయాలు వెలుగులోకి

19 Jul, 2020 13:21 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలో వెలుగు చూసిన 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో కొత్త విషయాలు బయట పడుతున్నాయి. హవాలా రూపంలో గత ఏడాది నుంచి ఇప్పటిదాకా దాదాపు 180 కేజీల బంగారం అక్రమ రవాణా జరిగినట్లు ఎన్‌ఐఏ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దాదాపు 13 సార్లు విమానాల ద్వారా బంగారాన్ని స్మగ్లింగ్ చేశారని ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అధికారులు భావిస్తున్నారు. భారీ ఎత్తున బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన కేసులో సరిత్, స్వప్న సురేష్, ఫాజిల్ ఫరీద్, సందీప్ నాయర్‌లను ఎన్‌ఐఏ నిందితులుగా గుర్తించింది. ఈ కేసులో పట్టుబడిన స్వప్న సురేష్, సందీప్ నాయర్‌లను ఎన్‌ఐఏ ఇప్పటికే కస్టడీలోకి తీసుకుంది.

చదవండి: కేరళ గోల్డ్‌ స్కామ్‌కు హైదరాబాద్‌కు లింకు?

దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించడానికి వీరివురిని శనివారం నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. దర్యాప్తులో భాగంగా  స్వప్నా సురేష్, సరిత్‌లను వారి ఇళ్లకు, కార్యాలయాలకు కూడా తీసుకెళ్లారు. కీలక నిందితడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫాజిల్ ఫరీద్ కోసం బ్లూ నోటీసు జారీ చేయాలని ఇంటర్ పోల్‌ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ కోరింది. కేసులో మరో నిందితుడైన సరిత్‌ని కూడా తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్‌ఐఏ అధికారులు కస్టమ్స్ శాఖను కోరారు. కాగా బంగారం స్మగ్లింగ్ ద్వారా వఛ్చిన సొమ్మును హవాలా మార్గాల ద్వారా దుబాయ్‌కి తరలించారని.. ఈ వ్యవహారమంతా ఫాజిల్ ఫరీద్ అధ్వర్యంలో జరిగిందని అనుమానిస్తున్నారు.  చదవండి: గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు : ఎన్‌ఐఏ కస్టడీకి కీలక నిందితులు

కాగా తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు చెందిన పార్మిల్లో 30 కిలోల బంగారాన్ని జూలై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్నా సురేష్‌ ఆరోపణలు ఎదుర్కోవడంతో వీరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో స్వప్నా సురేష్‌‌తో సన్నిహితంగా ఉన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను బదిలీ చేశారు. ఈ వ్యవహారంపై  కేసు దర్యాప్తుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలపడంతో కేంద్రం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పజెప్పింది. ఇక దీనిపై విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ గోల్డ్‌ స్మగ్లింగ్‌ ఉగ్రవాద కార్యకలాపం లాంటిదేనని, త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేస్తామని పేర్కొంది

>
మరిన్ని వార్తలు