కుడి ఎడమైతే.. పొరపాటు లేదోయ్‌!

9 Sep, 2018 02:09 IST|Sakshi

అవసరం.. దాని నుంచి వచ్చిన ఆలోచన.. కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది. మిగతా విద్యార్థులకంటే తన కొడుకు ఎందుకు ఆలస్యంగా రాస్తున్నాడనే ఓ తండ్రి ఆవేదన.. ఆలోచన నుంచి వచ్చిందే ‘ది లెఫ్ట్‌ హ్యాండ్‌ షాప్‌’. 

ఏమిటి దీని ప్రత్యేకత 
పెన్నో, పెన్సిలో కావాలంటే ఏదైనా స్టేషనరీ దుకాణానికి వెళ్లి ఠక్కున కొనుక్కుంటాం. మరిఎడమ చేతివాటం ఉన్నవారికి..? వారు ఏ పని చేసినా ఎడమ చేతినే ఎక్కువగా ఉపయోగిస్తారు.. అలాంటివారికి అనువైన వస్తువులు చాలా అరుదుగా దొరుకుతాయి. మరి వారి పరిస్థితేంటి.. అడ్జస్ట్‌ అవాల్సిందేనా.. అవసరం లేదు ‘లెఫ్ట్‌హ్యాండ్‌’వస్తువులు కూడా ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. లెఫ్ట్‌హ్యాండ్‌ పెన్, లెఫ్ట్‌హ్యాండ్‌ పెన్సిల్, లెఫ్ట్‌హ్యాండ్‌ కత్తెర, స్కేళ్లు ఇలా చాలా వస్తువులు సులువుగా ఆన్‌లైన్‌ వేదికగా కొనేసుకోవచ్చు. మొత్తం జనాభాలో 10 శాతం ఎడమచేతి వాటం ఉన్నవారున్నారని ఓ అంచనా. ఇప్పుడిప్పుడే వారికోసం స్టేషనరీ, ఇతర వస్తువులు తయారు చేస్తున్నారు. ఈ వస్తువులకు డిమాండ్‌ కూడా పెరుగుతోంది. విదేశీ వస్తువులే ఆన్‌లైన్‌ మార్కెట్‌లో ఎక్కువగా ఉండటంతో ధర ఎక్కువగా ఉంటోంది. దీంతో దేశీయంగా ఆయా వస్తువులు తయారు చేస్తున్నారు. 

ఏమిటి తేడా 
లెఫ్ట్‌హ్యాండ్‌ కత్తెరకు బ్లేడ్‌లు రివర్స్‌లో ఉంటాయి. పైన ఉండే బ్లేడ్‌ ఎప్పుడూ ఎడమచేతి వైపు ఉంటుంది. పెన్నును ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. పెన్‌కు ఉండే నిబ్‌ చివర రౌండ్‌గా ఉండి మధ్యలో కట్‌ అయి ఉంటుంది. దీని వల్ల ఇంక్‌ సులభంగా ఫ్లో అవుతూ రాయడానికి అనువుగా ఉంటుంది. అలాగే షార్ప్‌నర్‌లో పెన్సిల్‌ను ఉంచి అపసవ్వ దిశలో తిప్పాలి. 15 సెం.మీ, ఆరు ఇంచులు ఉన్న స్కేలులో సంఖ్యలు కుడి నుంచి ఎడమకు ఉంటాయి. ఇలా ప్రతీ వస్తువు ఎడమచేతి వాటానికి అనువుగా తయారు చేస్తున్నారు. 

ఎలా మొదలైంది 
పుణేకు చెందిన పవిత్తర్‌ సింగ్‌ స్కూల్‌లో మిగతా విద్యార్థులకంటే తన కొడుకు ఆలస్యంగా రాయడాన్ని గమనించాడు. పెన్సిల్‌తోనే కాదు పెన్‌తోనూ ఇలానే రాస్తున్నాడు. తన కొడుకుది ఎడమ చేతివాటం కాబట్లే ఇలా రాస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. అంతే ఆ వస్తువుల కోసం ఆన్‌లైన్‌లో వెతికాడు. అయితే ధర ఎక్కువగా ఉంది. ఒక్కో పెన్ను రూ.1,500 , షార్ప్‌నర్‌ రూ.600 వరకు ధరలు ఉన్నాయి. దీంతో ఎడమచేతి వాటం వారు ఉపయోగించే వస్తువుల కోసం ఆయన‘ది లెఫ్ట్‌హ్యాండ్‌ షాప్‌’పేరుతో దేశంలోనే తొలికంపెనీ ప్రారంభించారు. ‘మై లెఫ్ట్‌’బ్రాండ్‌ పేరుతో స్కూల్‌ స్టేషనరీ, క్రికెట్‌కు సంబంధించిన వస్తువులను విక్రయించడం మొదలు పెట్టారు. రూ.99కే స్కూల్‌ స్టేషనరీ కిట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్, సోషల్‌ మీడియా ద్వారా ఈ వస్తువులను విక్రయిస్తున్నారు. ఎడమ, కుడిచేతి వాటం కలిగిన ఇద్దరూ ఉపయోగించేలావస్తువుల తయారీపై తాజాగా దృష్టి పెట్టినట్లు సింగ్‌ తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ఓ కంపెనీ కూడా సింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 

వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రచారం
ఈ తరహా వస్తువులపై అవగాహన కలిగించేందుకు మహారాష్ట్రలో ఎడమ చేతి వాటం ఉన్న పిల్లల తల్లిదండ్రులు 160 మంది వరకు కలసివాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసుకున్నారు. ఫేస్‌బుక్‌ గ్రూప్‌లు, లెఫ్ట్‌ హ్యాండర్స్‌ క్లబ్‌లు ఏర్పాటు చేసుకుని వీటి గురించి విçస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు