గురుగ్రామ్‌పై మిడతల దండు దాడి

28 Jun, 2020 05:09 IST|Sakshi
గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్‌ ప్రాంతంలో కనిపించిన మిడతల గుంపు

గురుగ్రామ్‌/న్యూఢిల్లీ: దాదాపు రెండు కిలోమీటర్ల మేర వ్యాపించిన రాకాసిమిడతల గుంపులు ఢిల్లీ–గురుగ్రామ్‌ సరిహద్దు దాకా చేరాయి. ఢిల్లీలోకి ఇంకా ప్రవేశించలేదని అధికారులు చెప్పారు. పశ్చిమం నుంచి తూర్పు వైపు పయనమైన మిడతల దండు శనివారం ఉదయం 11.30 గంటలకు గురుగ్రామ్‌లోకి ప్రవేశించిందని హరియాణా వ్యవసాయ శాఖలో మిడతల హెచ్చరిక విభాగం అధికారి కేఎల్‌ గుర్జార్‌ తెలిపారు. ప్రస్తుతం హరియాణాలోని పాల్వాల్‌ వైపు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. పంటలను భోంచేసే ఈ మిడతలు ఈ ఏడాది మే నెలలో ఆఫ్రికా ఎడారుల నుంచి భారత్‌లోకి అడుగుపెట్టాయి. తొలుత రాజస్తాన్‌లో, తర్వాత పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించాయి.  

ఢిల్లీలో హై అలర్ట్‌  
మిడతల దండు ఢిల్లీ సరిహద్దు దాకా రావడంతో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల్లో శనివారం హైఅలర్ట్‌ ప్రకటించింది. మిడతలు దండెత్తకుండా చెట్లపై రసాయనాలు, పురుగు మందులు చల్లాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వేప ఆకులను మండిస్తే పొగకు మిడతలు పారిపోతాయని వెల్లడించింది.
 

మరిన్ని వార్తలు