విదేశీ విరాళాలపై సవరణకు ఓకే

19 Mar, 2018 02:15 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల విదేశీ విరాళాలపై తనిఖీ అవసరం లేదన్న సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. 21 సవరణలతో కూడిన 2018 ఆర్థిక బిల్లును విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ బుధవారం చర్చ లేకుండానే ఆమోదించింది. వాటిలో విదేశీ సంస్థల నుంచి పార్టీలు విరాళాలు స్వీకరించడాన్ని నిషేధిస్తూ చేసిన విదేశీ విరాళాల నియంత్రణ చట్ట (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ కూడా ఒకటి. 1976 నుంచి పార్టీలు విదేశాల నుంచి పొందిన నిధులపై ఎలాంటి సమీక్ష, తనిఖీ ఉండకూడదనేది ఈ సవరణ ఉద్దేశం.

పార్టీలు విదేశీ విరాళాలు స్వీకరించడాన్ని సులభతరం చేస్తూ బీజేపీ ప్రభుత్వం 2016 ఆర్థిక బిల్లు ద్వారా ఎఫ్‌సీఆర్‌ఏ చట్టానికి సవరణ చేసింది. ప్రస్తుతం దానికి కొనసాగింపుగా 1976 నుంచి పొందిన విరాళాలకు తనిఖీ అవసరం లేదంటూ మరో సవరణ చేసింది. ‘2016 ఆర్థిక చట్టంలోని సెక్షన్‌ 236 తొలి పేరాలో ఉన్న 26 సెప్టెంబర్‌ 2010కు బదులుగా 5 ఆగస్టు 1976ని మార్చాం’అని లోక్‌సభ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఈ సవరణ ఎఫ్‌సీఆర్‌ఏ ఉల్లంఘన కేసులో దోషులంటూ 2014 ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో వేసిన అప్పీళ్లను ఉపసంహరించుకున్నాయి.

మరిన్ని వార్తలు