అటాచ్మెంట్కు ముందే ఆస్తులు అమ్మేసిన మాల్యా!

13 Jun, 2016 09:59 IST|Sakshi
అటాచ్మెంట్కు ముందే ఆస్తులు అమ్మేసిన మాల్యా!

న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లు ఎగ్గొట్టి, లండన్ పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు గట్టి షాకిచ్చాడు. అటాచ్ మెంట్ (స్వాదీనం) కు ముందే గుట్టుచప్పుడు కాకుండా తన ఆస్తులను మంచి ధరకు అమ్మేసుకున్నాడు. ఆర్థిక నేర పరిశోధనలో అత్యున్నత సంస్థగా భావించే ఈడీ తీరుపైనా తీవ్రస్థాయి విమర్శలు చేశాడు. ఈడీలో పనిచేస్తోన్న విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సమాచారం తెలిసింది.

మాల్యా ఆస్తులు స్వాధీనానికి ఈడీకి అనుమతినిస్తూ శనివారం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తర్వుల కాపీ అందిన వెంటనే వివిధ ప్రాంతాల్లో మాల్యాకు చెందిన రూ.1,411 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఈడీ ప్రకటించింది. అయితే అంతకుముందే మాల్యా కూర్గ్ ప్రాంతంలోని  రెండు భారీ ఆస్తులను అమ్మేసుకున్నాడు. సదరు ఆస్తుల అమ్మకాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా గుర్తించిన ఈడీ.. ఆ రెండు ఆస్తులు అటాచ్ మెంట్ జాబితాలో ఉన్నవేనా? లేక వేరేవా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదు.

 

విక్రయానికి సంబంధించిన డబ్బు మాల్యా చేతికి చేరిందా, లేదా అనే దానిపై దర్యాప్తు ప్రారంభించామని, నెలలోపే దీనికి సంబంధించిన వివరాలు సేకరిస్తామని ఈడీ అధికారలు చెబుతున్నారు. ఇక లండన్ లో ఉన్న మాల్యా ఎప్పటిలాగే ప్రభుత్వ సంస్థల తీరును తప్పుపడుతున్నాడు. ఒక్కరోజులోనే రూ.1,411 కోట్ల ఆస్తుల అటాచ్ మెంట్ కు కోర్టు అనుమతి ఎలా ఇస్తుందని, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిన యూనైటెడ్ బ్రేవరేజ్ హోల్డింగ్ లిమిటెడ్ ఆస్తులను ఈడీ ఎలా స్వాధీనం చేసుకుంటుందని ప్రశ్నించాడు. తాను రుణాన్ని తిరిగి చెల్లించాలనుకుంటున్నా, ఈడీ మాత్రం అన్ని దారులు మూసేస్తున్నదని ఆరోపించారు. లోన్ రికవరీ అనేది సివిల్ కేసు అని, దర్యాప్తు ఏకపక్షంగా చేసి దానిని క్రిమినల్ కేసుగా మార్చారని విమర్శించారు.

మరిన్ని వార్తలు