కోర్టులో వాదించకుండా అడ్డుకోలేం

26 Sep, 2018 01:37 IST|Sakshi

చట్టసభ్యులుగా ఎన్నికైన లాయర్ల ప్రాక్టీస్‌పై సుప్రీంకోర్టు తీర్పు

న్యూఢిల్లీ: చట్టసభ్యులుగా ఎన్నికైన న్యాయవాదుల్ని కోర్టుల్లో వాదించకుండా అడ్డుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చట్టసభ్యులయ్యాక న్యాయవాద వృత్తిని కొనసాగించకూడదని న్యాయవాద వృత్తి కోసం ఉద్దేశించిన చట్టంలో ఎక్కడా లేదని పేర్కొంది. ‘చట్టసభ్యులుగా కొనసాగుతున్న వారు అడ్వకేట్స్‌గా ప్రాక్ట్రీస్‌ చేయకూడదని అడ్వకేట్స్‌ యాక్ట్, 1961, దాని ఆధారంగా రూపొందించిన నిబంధనలు ఎలాంటి నిషేధమూ విధించలేదు’ అని సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ప్రజాప్రతినిధులు ఏ వ్యక్తి, సంస్థ, ప్రభుత్వం, కార్పొరేషన్‌ లేదా ఇతర సంస్థల్లో పూర్తి స్థాయి ఉద్యోగి కాదు. అందువల్ల ఈ కేసులో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించిన 49వ నిబంధన వారికి వర్తించదు అని స్పష్టం చేసింది. చట్టసభ్యులుగా కొనసాగుతున్నంత కాలం న్యాయవాదులు కోర్టులో వాదించకుండా నిషేధం విధించాలని బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిల్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

చట్టసభ్యులు పూర్తికాలపు ఉద్యోగులు కారని, వారి మధ్య ఉద్యోగి, యజమాని సంబంధం లేదంది. ‘చట్టసభ్యులు(ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులు. 1954 నాటి చట్టం కింద వారు జీతం అందుకుంటున్నారు. అలాగే వివిధ నిబంధనలకు అనుగుణంగా అలవెన్స్‌లు పొందుతున్నారు. అయితే ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం, చట్టసభ్యుల మధ్య ఉద్యోగి, యజమాని సంబంధం ఉండదు’ అని  తీర్పులో పేర్కొంది.

మరిన్ని వార్తలు