రాజ్యసభ సభ్యుల ఎంపిక డ్రా వాయిదా

28 May, 2014 12:36 IST|Sakshi
రాజ్యసభ సభ్యుల ఎంపిక డ్రా వాయిదా

న్యూఢిల్లీ : లాటరీ పద్దతిలో  రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. లాటరీ విధానంపై ఎంపీలు అభ్యంతరం తెలపటంతో రాజ్యసభ సభ్యుల ఎంపికను ఎల్లుండి సాయంత్రం 4గంటలకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో రాజ్యసభ సభ్యుల విభజన ఆసక్తికరంగా మారింది. 

 

ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో 18 మంది రాజ్యసభ సభ్యులుండగా వీరిలో 11 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, ఏడుగురిని తెలంగాణకు కేటాయించనున్నారు. 18 మంది ఎంపీలకుగాను నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మరణించడంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. మిగిలిన 17 మందిలో 9 మంది తెలంగాణకు చెందిన వారుండగా, 8 మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్ వారు కావడంతో లాటరీ అనివార్యమైంది.

రాజ్యసభలో రెండేళ్లకోసారి మూడోవంతు సభ్యుల పదవీకాలం ముగియడం, వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవడం సాధారణ ప్రక్రియ. ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో 2016లో ఆరుగురు, 2018లో మరో ఆరుగురు, 2020లో ఇంకో ఆరుగురు సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే లాటరీ ప్రక్రియ కూడా ఒకేసారి 18 మంది ఎంపీలను కలిపి కాకుండా రిటైర్‌మెంట్ వారీగానే నిర్వహించనున్నారు. అందులో భాగంగా తెలంగాణకు 2016లో ఇద్దరిని, 2018లో ముగ్గురిని, 2020లో ఇద్దరు ఎంపీల చొప్పున కేటాయించాల్సి ఉంటుంది.

 

మరిన్ని వార్తలు