‘ప్రజలు చూపిన సహనం.. సోదరభావాన్ని తెలుపుతోంది’

10 Nov, 2019 20:19 IST|Sakshi

ఢిల్లీ: అయోధ్య–బాబ్రీ మసీదు భూవివాదంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తర్‌ అబ్బాస్‌ నఖ్వి ఘాటుగా స్పందించారు. ఒవైసీ వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోవద్దని అన్నారు. కొంతమంది వ్యక్తులకు ఎలాంటి అంశం మీదైనా వ్యతిరేకరంగా మాట్లాడటం అలవాటుగా మారిందని విమర్శించారు. సుప్రీం తీర్పుపై ఒవైసీ మాటలను పరిగణలోకి తీసుకోకుడదని అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్ని వర్గాల వారు ఈ తీర్పును స్వాగతించారని గుర్తుచేశారు. సుప్రీం తీర్పుపై దేశ ప్రజలు సహనంతో చూపిన శాంతి, సోదరభావాన్ని ఎవరు చెరపలేరని పేర్కొన్నారు. సున్నితమైన ఈ కేసు తీర్పును దేశప్రజలు స్వాగతించారని తెలిపారు. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయకూడదన్న సున్నీ వక్ఫ్‌ బోర్డు నిర్ణయాన్ని నఖ్వీ అభినందించారు. సుప్రీంకోర్టు అయోధ్య భూవివాదంపై ఇచ్చిన తీర్పుపై ఒవైసీ  స్పందిస్తూ.. తీర్పు తనకు అసంతృప్తి కలిగించిందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని శనివారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు వెలువరించింది. రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించిండంతో పాటుగా... మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీ వక్ఫ్‌ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. దీంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వివాదానికి తెరపడింది.
 

మరిన్ని వార్తలు