ప్రపంచం భారత్‌ వైపు చూస్తోంది!

1 Oct, 2019 03:01 IST|Sakshi
ఐఐటీ మద్రాస్‌ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న ఐఐటీ డైరెక్టర్‌ రామమూర్తి

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఐఐటీ విద్యార్థుల కృషి అమోఘం 

ఐఐటీ మద్రాస్‌లో ప్రధాని మోదీ 

చెన్నై: భారత్‌ వైపు ప్రపంచం ఒక ఆశావహ దృక్పథంతో చూస్తోందని, భారతీయ యువత శక్తి సామర్థ్యాలపై ప్రగాఢ విశ్వాసం చూపుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ‘అమెరికా పర్యటన నుంచి రెండు రోజుల క్రితమే తిరిగొచ్చాను. అక్కడ పలు దేశాల అధినేతలతో, బిజినెస్‌ లీడర్లతో, పెట్టుబడిదారులతో భేటీ అయ్యాను. ప్రతీ భేటీలోనూ ఒకటి ప్రత్యేకంగా నాకు కనిపించింది. అది భారత్‌ పట్ల సానుకూల ధోరణి.. భారతీయ యువత సామర్ధ్యంపై నమ్మకం’ అని వివరించారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఐఐటీ మద్రాసు 56వ స్నాతకోత్సవంలో ప్రధాని ప్రసంగించారు. ‘ప్రపంచమంతా వినూత్న అవకాశాల దేశంగా భారత్‌ వైపు చూస్తున్న తరుణంలో మీరు ఈ కాలేజ్‌ నుంచి డిగ్రీతో బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు మీ ముందు ఎన్నో అవకాశాలున్నాయి. వాటిని ఉపయోగించుకోండి. కానీ మీకు నాదో విన్నపం. ఎక్కడ ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా.. మీ మాతృదేశ అవసరాలను గమనించండి. మీ పని, మీ ఆవిష్కరణ, మీ పరిశోధన మీ సోదర భారతీయుడికి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచిస్తూ ఉండండి’ అని విద్యార్థులను కోరారు. సైన్స్, టెక్నాలజీ, నూతన ఆవిష్కరణల్లో భారతీయులు ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేశారన్నారు.

వారిలో మీ సీనియర్ల పాత్ర చాలా కీలకమని ఐఐటీ విద్యార్థులకు గుర్తు చేశారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లోనూ ఐఐటీ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణులవుతున్నారని, ఈ విషయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, ఈ విధంగా కూడా దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారని  వ్యాఖ్యానించారు. ‘కార్పొరేట్‌ ప్రపంచంలోనూ మీరున్నారు. దేశాభివృద్ధిలో మీ పాత్ర కీలక’మన్నారు. ‘కాలేజ్‌ లైఫ్‌ను ఇకపై మీరు కోల్పోతున్నారు. ఇక ఖరీదైన పాదరక్షలను మీరు కొనుక్కోవచ్చు’ అని చమత్కరించారు. ఐఐటీ మద్రాసు క్యాంపస్‌లోకి వచ్చి ఖరీదైన దుస్తులు, పాదరక్షలు, వస్తువులు ఎత్తుకుపోతున్న కోతుల బెడదను ఉద్దేశించి మోదీ అలా వ్యాఖ్యానించారని కాలేజీ వర్గాలు తెలిపాయి.

గృహావసరాలకు వాడుతున్న నీటిని పునర్వినియోగించడంపై, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌కు పర్యావరణ హిత ప్రత్యామ్నాయాన్ని కనుగొనడంపై పరిశోధనలు చేయాలని విద్యార్థులకు మోదీ సూచించారు. అలాగే, విద్యార్థులు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దని, ఫిట్‌నెస్‌ పైన దృష్టిపెట్టాలని కోరారు. అంతకుముందు ‘సింగపూర్, ఇండియా హ్యాకథాన్‌ 2019’ విజేతలకు మోదీ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచ అవసరాలను తీర్చగల సాంకేతిక ఆవిష్కరణలను భారత్‌ రూపొందించగలదన్నారు. పాఠశాలల నుంచి కళాశాలల వరకు అన్ని చోట్ల.. ఆవిష్కరణలను ప్రోత్సహించే వ్యవస్థ మన దగ్గర ఉందన్నారు.

అమెరికాలో తమిళం ప్రతిధ్వనిస్తోంది
చెన్నై పర్యటనలో భాగంగా అక్కడి ప్రజలను వణక్కం(నమస్కారం) అంటూ తమిళంలో పలకరించారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని అక్కడ  తమిళంలో ఓ వాక్యం పలికారు. ‘చెన్నై ప్రజలను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’ అని తమిళంలో అని కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఆ కార్యక్రమంలోనూ, తర్వాత ఐఐటీ మద్రాసు స్నాతకోత్సవంలోనూ తమిళంపై మోదీ ప్రశంసలు కురిపించారు. అమెరికా అంతా తమిళం ప్రతిధ్వనిస్తోందని ఇటీవలి అమెరికా పర్యటనలో తనకు స్పష్టమైందన్నారు. చెన్నై ఇచ్చిన ఆతిథ్యం అద్భుతంగా ఉందన్నారు. ముఖ్యంగా ఇడ్లీ, సాంబారు, వడ, దోస చాలా బావున్నాయన్నారు. న్యూయార్క్‌లో ఐరాస వేదికపై నుంచి ప్రసంగించిన సమయంలోనూ తమిళ భాషను ప్రధాని ప్రస్తావించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన భాష తమిళమని పేర్కొన్నారు. ప్రసిద్ధ తమిళ కవి కనియన్‌ పూంగుంద్రనర్‌ కవితా పంక్తిని కూడా ఉటంకించారు. దేశానికి ఒక జాతీయ భాషగా హిందీ ఉండాలన్న అమిత్‌షా వ్యాఖ్యలకు నష్టపరిహారంగా మోదీ తమిళబాట పట్టారని విశ్లేషకుల అంచనా.

మరిన్ని వార్తలు