జీవితాశయాలకే ప్రాధాన్యం 

4 Mar, 2020 02:36 IST|Sakshi

89% భారతీయ మహిళల మనోగతమిదే

తాజా సర్వేలో వెల్లడి

ముంబై: జీవితమన్నాక ఒక ఆశయం ఉండాలి. అది సాధించడానికి కష్టపడాలి. అంతిమంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యతనిస్తూనే కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలి. ఇదీ మన భారతీయ మహిళల మనోగతం.. మహిళా ఉద్యోగుల్లో 89శాతం మంది తమకంటూ ఆశయం ఉండాలని, అదే అత్యంత ముఖ్యమని చెప్పారని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ , న్యూయార్క్‌కు చెందిన మహిళా సంస్థ యాంబిషియస్‌ ఇన్‌సైట్స్‌ సంయుక్త సర్వే వెల్లడించింది. జీవితంలో ఒక ఆశయాన్ని పెట్టుకొని దానిని సాధించడం అంత సులభమేమీ కాదు. అందులో ఎన్నో కోణాలుంటాయి.

వృత్తిపరమైన విజయాలు, ఆర్థిక స్వాతంత్య్రం, నైపుణ్యం, వ్యక్తిగత ఆరోగ్యం, పిల్లల పెంపకం, కుటుంబ బాంధవ్యాలు పటిష్టంగా ఉండడం వంటివన్నీ అందులో మిళితమై ఉంటాయి. వీటన్నింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ అటు వృత్తిపరంగా, ఇటు వ్యక్తిగతంగా అద్భుతమైన ఫలితాలు సాధించాలన్న తపన భారతీయ మహిళల్లోనే ఎక్కువగా ఉందని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ ఇండియా సీఈఓ మనోజ్‌ అద్లాఖా అన్నారు. భారతీయ మహిళలు అత్యంత శక్తిమంతులని వారికి అవకాశం వస్తే తాము అనుకున్నది సాధించి ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తారని ఆయన కొనియాడారు.

సర్వే ఇలా..
విశ్వవిద్యాలయాల్లో చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న 21–64 ఏళ్ల మధ్య వయసున్న 3,026 మంది మహిళల్ని ఆన్‌లైన్‌ ద్వారా సర్వే చేశారు. గత నెల జనవరి 10–16 మధ్య జరిగింది. భారత్‌ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, మెక్సికో, యూకేలలో సర్వే నిర్వహించారు.

ఆశయ సాధనలో..
భారత్‌: 89%
మెక్సికో: 82% 
అమెరికా: 68%
ఫ్రాన్స్‌: 41% 
జపాన్‌: 28%

వ్యక్తిగత అంశాల్లో..
భారత్‌: 91% 
ప్రపంచ సగటు: 68%

కెరీర్‌లో..
భారత్‌: 78% 
మెక్సికో: 69%
అమెరికా: 44%
జపాన్‌: 17%

మరిన్ని వార్తలు