దుమారం రేపుతున్న నిర్భయ దోషి ఫ్లెక్సీ ఫోటో

20 Jul, 2019 11:16 IST|Sakshi

చండీగఢ్‌: ఎన్నికలపై ఓటర్లకు అవగహన కల్పించేందుకు పంజాబ్‌లో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనలో ప్రధాన దోషిగా ఉన్న ముఖేష్‌ సింగ్‌ ఫోటోను ఆ ఫ్లెక్సీలో వేయడమే దీనికి కారణం. పంజాబ్‌లోని హోస్లాపూర్‌ జిల్లా కార్యాలయం సమీపంలో దీనిని ఏర్పాటు చేశారు. ప్రముఖ పంజాబ్‌ గాయకుడు గురుదాస్‌ మాన్‌, ఆటగాడు అభినవ్‌ బీంద్రాతో పాటు ముఖేష్‌ చిత్రం కూడా ఫ్లెక్సీలో ఉంది. దీనిని గమనించిన కొందరు ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో స్పందించిన మంత్రి శ్యామ్‌ ఆరోరా.. ఘటనపై విచారణకు ఆదేశించామని, అధికారుల తప్పిదం కారణంగా ఇది జరిగిందని వివరించే ప్రయత్నం చేశారు. దీనికి కారణమయిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

ఢిల్లీలో 2012 డిసెంబర్‌ 16న రాత్రి తన స్నేహితుడితో బస్సులో ప్రయాణిస్తున్న 23 ఏళ్ల యువతిపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె సింగపూర్‌లో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో మరణించారు. నిర్భయగా పేరుపొందిన ఈ కేసులో ఒక్క మైనర్‌ మినహా మిగిలిన ఐదుగురికి ఉరి శిక్ష పడింది. అందులో ఒకరైన ముఖేష్‌ తనకు విధించిన ఉరి శిక్షను రద్దు చేయాలని పిటిషన్‌ వేశాడు. అంతేకాక అత్యాచారాలకు మహిళలే కారకులు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్దదుమారమే సృష్టించాయి. దీంతో ముఖేష్‌ను వెంటనే ఉరి తీయాలని చాలామంది డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు