ఇరాక్ మిలిటెంట్ల చెరలో కేరళ నర్సులు

4 Jul, 2014 10:13 IST|Sakshi
ఇరాక్ మిలిటెంట్ల చెరలో కేరళ నర్సులు

తిక్రిత్ నుంచి 46 మందిని బలవంతంగా తరలింపు

ముగ్గురు నర్సులకు గాయాలు; అంతా క్షేమం: కేరళ సీఎం

క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ/తిరువనంతపురం/బాగ్దాద్: ఇరాక్‌లోని తిక్రిత్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చిక్కుకుపోయిన 46 మంది భారతీయ నర్సులను(అంతా కేరళకు చెందినవారే) గురువారం తిరుగుబాటుదారులు బలవంతంగా మరో ప్రాంతానికి తరలించారు. ఎక్కడికి తీసుకెళ్లినదీ కచ్చితంగా తెలియనప్పటికీ.. సున్నీ మిలిటెంట్ల అధీనంలో ఉన్న మోసుల్ పట్టణం వైపు వెళ్లినట్లు సమాచారముందని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వెల్లడించారు. గత మూడు రోజులుగా వారిని ఆసుపత్రి ప్రాంగణం నుంచి తరలించేందుకు మిలిటెంట్లు ప్రయత్నించినప్పటికీ నర్సులు ప్రతిఘటించడంతో.. గురువారం తెల్లవారుజామున బాంబులు పేల్చి, నర్సులను భయభ్రాంతులకు గురిచేసి,  బలవంతంగా మూడు బస్సుల్లోకి ఎక్కించి తరలించారు.
 
ఈ క్రమంలో ముగ్గురు నర్సులకు స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే, నర్సులంతా క్షేమంగా ఉన్నారని, వారిని క్షేమంగా విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అంతర్జాతీయ మానవతావాద సంస్థలను కూడా సంప్రదిస్తున్నామని ఆ శాఖ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ వెల్లడించారు. తమ రాష్ట్ర నర్సులను క్షేమంగా భారత్ తీసుకురావాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ గురువారం విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో సమావేశమయ్యారు.

కుటుంబ సభ్యుల ఆందోళన: ఇరాక్‌లో మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్న నర్సుల కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమవారి విడుదల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. తిక్రిత్‌లోని బంగ్లాదేశీయులను ఆ దేశం తరలించిందని, ఆ మాత్రం కూడా మనవారు చేయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.
 
ఒబామా మంతనాలు: ఇరాక్ సంక్షోభం తీవ్ర కావడంతో.. సంక్షోభ నివారణకు అమెరికా సంప్రదింపులు తీవ్రం చేసింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురువారం సౌదీ రాజు అబ్దుల్లాకు ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జో బెడైన్ ఇరాక్‌లోని సున్నీల నేత, గత పార్లమెంటు స్పీకర్ అయిన ఒసామా అల్ నుజైఫీతో.. విదేశాంగమంత్రి జాన్ కెర్రీ కుర్దుల నేత మస్సూద్ బర్జానీతో చర్చలు జరిపారు.
 
తూర్పు సిరియాలోనూ మిలిటెంట్ల పట్టు

బీరుట్: తూర్పు సిరియాలోని దీర్ ఎజ్ జార్ రాష్ట్రాన్ని గురువారం సున్ని మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సిరియాలోని అత్యధిక ప్రాంతం ప్రస్తుతం ఐఎస్‌ఐఎస్ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉందని, అది లెబనాన్ భూభాగం కన్నా ఐదురెట్లు ఎక్కువని సిరియాలోని మానవహక్కుల సంస్థ వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు