వెరైటి వరకట్నం..పెరుగుతూనే ఉంటుంది

25 Jun, 2018 11:10 IST|Sakshi
వివాహనికి హాజరైన అతిథిలకు మొక్కలు పంచుతున్న సరోజ్‌ కాంత్‌ బిస్వాల్‌

భువనేశ్వర్‌ : ఆడపిల్ల వివాహం తల్లిదండ్రులకు ఎంతటి భారమో తెలిసిన సంగతే. కారణం ‘వరకట్నం’...నేటికి ఈ వరకట్న భూతానికి జడిసి సమాజంలో చాలా మంది ఆడపిల్లల్ని వద్దనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో భారీ వరకట్నాన్ని కోరి మరి అత్తింటి వారికి సంతోషాన్ని కల్గించాడు ఒరిస్సాకు చెందిన ఓ వ్యక్తి. అందేంటి కట్నం అడిగితేనే ఎవరికైన కోపం వస్తుంది. అలాంటిది భారీ కట్నం అడిగినా సంతోషించడం ఎంటనుకుంటున్నారా...? అక్కడే ఉంది అసలు విషయం. ఈ పెళ్లి కొడుకు ‘పచ్చ నోట్ల’(నోట్ల రద్దు పుణ్యామాని ఇప్పుడు ఈ పచ్చనోట్లు కనిపించడం లేదు) కట్నం బదులు ‘పచ్చని మొక్కల’ను కోరాడు. హరిత కట్నం ఎవరికైనా హర్షమే కదా.

ఈ పచ్చని వివాహ వివరాలు...ఒరిస్సా కేంద్రపర జిల్లా బలభద్రపూర్‌ గ్రామానికి చెందిన సరోజ్‌ కాంత్‌ బిస్వాల్‌(33) పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి మరో పంతులమ్మతో వివాహం కుదిరింది. బిస్వాల్‌కు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. అందుకే తన వివాహానికి కట్నంగా 1000 మొక్కలను ఇవ్వాలని అడిగాడు. అవి కూడా పళ్ల మొక్కలనే కోరాడు. అందుకు బిస్వాల్‌కు కాబోయే మామ గారు కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. ఈ నెల 22న బిస్వాల్‌ వివాహం కాలుష్యరహితంగా, పర్యావరణహితంగా పచ్చగా జరిగింది. వివాహానికి వచ్చిన బంధువులందరికి బిస్వాల్‌ మొక్కలు పంచి...ఆశీర్వాదాలు అందుకున్నాడు.

>
మరిన్ని వార్తలు