అమెరికా తరహా వ్యూహాలను అమలుపరచాలి: రావత్‌

16 Jan, 2020 12:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై యుద్ధం ఎక్కడా ముగియలేదని, ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే దాని మూలాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. టెర్రరిస్టులకు కొన్ని దేశాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు ఉన్నంతకాలం​ ఉగ్రవాదం ఉంటుందన్నారు. అదేవిధంగా ఆయా దేశాలు ఉగ్రవాదులను వారి ప్రతినిధులుగా ఉపయోగించుకుంటున్నారని, ఆయుధాలు, నిధులను సమకూరుస్తున్నారని దుయ్యబట్టారు. ఇవన్నీ కొనసాగినంత కాలం ఉగ్రవాదాన్ని అణచి వేయలేమని అన్నారు.

9/11 దాడుల తర్వాత టెర్రరిస్టులపై అమెరికా ఉక్కుపాదం మోపిన విధంగా వ్యవహరిస్తే తప్ప టెర్రరిజాన్ని నియంత్రించలేమని తెలిపారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా అమెరికా యుద్ధం చేస్తోందని జనరల్ రావత్ చెప్పారు. ఉగ్రవాదులను అంతం చేయాలంటే వారిని ఏకాకులను చేయాలని వారికి సహకరిస్తున్న దేశాలను టార్గెట్ చేయాలని అన్నారు. టెర్రరిస్టులకు సహకరిస్తున్న దేశాలను ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) బ్లాక్ లిస్టులో పెడుతుండటం మంచి పరిణామమని చెప్పారు. ఇలాంటి చర్యలతో ఉగ్రవాదులకు సహకరిస్తున్న దేశాలను ఏకాకిని చేయవచ్చని తెలిపారు.

చదవండి: కత్తెరించినా తెగని ఉక్కు కంచె ఏర్పాటు

మరిన్ని వార్తలు