ఆర్‌బీఐని, బ్యాంకులను ఎలా నమ్మాలి?

19 Dec, 2016 13:50 IST|Sakshi
ఆర్‌బీఐని, బ్యాంకులను ఎలా నమ్మాలి?

కొచ్చి: ఆర్బీఐ, బ్యాంకులు లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ మాటల దాడి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అనే విపత్కర నిర్ణయం కారణంగా దేశ ప్రజలకు ఆర్బీఐ, బ్యాంకింగ్‌ వ్యవస్థపై నమ్మకం పోయిందని అన్నారు. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్‌ శర్మ మాట్లాడుతూ ‘కోట్లకు కోట్లు కొత్తగా ప్రింట్‌ చేసిన నోట్లు వెనుక డోర్ల నుంచి బయటకు వెళ్లిపోతున్నాయి. కానీ, పేద ప్రజలు కష్టపడి సంపాధించుకున్న కొద్దిపాటి మొత్తం కూడా బ్యాంకుల నుంచి డ్రా చేసుకోలేకపోతున్నారు. వాస్తవానికి భారత ప్రజలకు ఆర్ధిక సంక్షోభం సమయంలో కూడా బ్యాంకింగ్‌ వ్యవస్థపై నమ్మకం ఉంది.

ఆ సమయంలో బ్యాంకులు తమ విశ్వాసాన్ని నిరూపించుకున్నాయి. కానీ, ఇప్పుడు మాత్రం ఆర్బీఐ, బ్యాంకులపై నమ్మకం పోయింది. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే ఎంతో కష్టపడి పేద ప్రజలు తాము సంపాధించుకున్న కొంతమొత్తం డబ్బును సేవింగ్‌ ఖాతాల్లో జమ చేసుకుంటారు. ఎందుకుంటే వారికి బ్యాంకులపై నమ్మకం. ఎప్పుడంటే అప్పుడు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తారు. కానీ, ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రజలు ఆ డబ్బును తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే బ్యాంకుల్లో డబ్బు లేదు. ఏటీఎంలలో లేదు. కానీ, కొంతమందికి మాత్రం బ్యాక్‌ డోర్ల ద్వారా కోట్లలో కొత్తగా ముద్రిస్తున్న నోట్లు ఏ సమస్య లేకుండా వెళ్లిపోతున్నాయి. ఇలాంటప్పుడు ప్రజలు ఎలా బ్యాంకులను, ఆర్బీఐని విశ్వసిస్తారు’   అని ఆనంద్‌ శర్మ అన్నారు.

మరిన్ని వార్తలు