జీఎస్టీని కలిపే ఎమ్మార్పీని ముద్రించాలి

31 Oct, 2017 01:49 IST|Sakshi

అంతకుమించి అమ్మితే నేరం

మంత్రివర్గ సంఘం

న్యూఢిల్లీ: కచ్చితంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ను కలుపుకునే ఒక వస్తువు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)ను ముద్రించాలని జీఎస్టీ సవరణలపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం సూచించింది. ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలు, శీతల పానీయాలు, నీళ్ల బాటిళ్లు తదితర ఎలాంటి వస్తువులనైనా మాల్స్, రెస్టారెంట్లు, సూపర్‌ మార్కెట్లు వంటి ఏ దుకాణంలోనైనా సరే ఎమ్మార్పీకి మించి అమ్మితే నేరంగా పరిగణించి కేసు నమోదు చేయాలని మంత్రివర్గ సంఘం స్పష్టం చేసింది.

వస్తువు అసలు ధర ఎంత, దానిపై పడుతున్న పన్ను ఎంత, మొత్తం ధర ఎంత అనే విషయాలను వాణిజ్య సంస్థలు బిల్లుల్లో స్పష్టంగా ముద్రించాలనీ, వస్తువుపై ఉన్న ఎమ్మార్పీకన్నా మొత్తం ధర ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువగా ఉండటానికి వీల్లేదని పేర్కొంది. అలాగే పన్ను రిటర్నుల దాఖలులో జాప్యమైతే ప్రస్తుతం జరిమానాగా రోజుకు రూ.100 విధిస్తుండగా, దానిని రూ.50కి తగ్గించాలని సిఫారసు చేసింది. నవంబర్‌ 10న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ మండలి గువాహటిలో సమావేశం కానుంది. మంత్రివర్గం సిఫారసులను ఆ భేటీలో జీఎస్టీ మండలి పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంది.

అమలును వికేంద్రీకరించండి: బిమల్‌
దేశంలో పేద, ధనిక రాష్ట్రాల ప్రాథమ్యాలు వేరుగా ఉంటాయనీ, కాబట్టి జీఎస్టీ అమలును వికేంద్రీకరించాలని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ బిమల్‌ జాలాన్‌ పేర్కొన్నారు. జీఎస్టీ సరిగ్గా అమలవ్వడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. జీఎస్టీ విధానంలో తక్కువ పన్ను వర్తించే వస్తువులను ఉత్పత్తి చేసే రాష్ట్రాలకు తక్కువ ఆదాయం, ఎక్కువ పన్ను వర్తించే వస్తువులను ఉత్పత్తి చేసే రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం వస్తుందని బిమల్‌ చెప్పారు. 

>
మరిన్ని వార్తలు