ఆధారాలు చూపించండి : అమర జవాన్ల కుటుంబాలు

6 Mar, 2019 16:09 IST|Sakshi

లక్నో : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహ్మద్‌ స్థావరం బాలకోట్‌పై భారత వైమానిక దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు మరణించారనే అంశంపై ఇంతవరకు స్పష్టత రాలేదు. మెరుపు దాడుల్లో సుమారు 250 నుంచి 350 వరకు హతమయ్యారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, అందుకు సాక్ష్యాలు చూపించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో పుల్వామా ఉగ్రదాడి బాధిత కుటుంబాలు కూడా ఇదే తరహా డిమాండ్‌తో ముందుకు వస్తున్నాయి. తమ కుటుంబాలకు జీవనాధారం లేకుండా చేసిన ఉగ్రవాదుల శవాలను చూస్తేనే తమకు శాంతి కలుగుతుందని పేర్కొంటున్నాయి.

అప్పుడే ప్రతీకారం తీరినట్టు
40 మందికి పైగా జవాన్లను పొట్టబెట్టుకున్న జైషే ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రదీప్‌ కుమార్‌, రామ్‌ వకీలు అమరులయ్యారు. ఈ క్రమంలో రామ్‌ వకీల్‌ సోదరి రామ్‌ రక్షా మాట్లాడుతూ.. ‘ పుల్వామాలో ఒక్కో వ్యక్తి చేతులు, కాళ్లు, ఇతర శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని చూశాం. ఇందుకు బాధ్యత వహించిన ఉగ్రవాదులపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుందనే భావిస్తున్నాం. అయితే ఇందుకు తగిన ఆధారాలు కావాలి. తమ దేశంలో ఎటువంటి నష్టం కలగలేదని పాకిస్తాన్‌ చెబుతోంది. కాబట్టి ఆధారాలు చూపించే వరకు మేము దీనిని అంగీకరించలేము. ఉగ్రవాదుల శవాలు చూస్తేనే మాకు శాంతి కలుగుతుంది. అప్పుడే నా సోదరుడి మృతికి ప్రతీకారం తీరినట్టు అవుతుంది’ అని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు.

ఇక ఈ విషయం గురించి ప్రదీప్‌ కుమార్‌ తల్లి మాట్లాడుతూ... ‘నా కొడుకు లాంటి ఎంతో మంది కొడుకులు కన్నుమూశారు. మెరుపు దాడులు చేశామన్న మాటలతో మాకు తృప్తి కలగడం లేదు. ఉగ్రవాదుల మృతదేహాలు చూసి తీరాల్సిందే. ప్రభుత్వమే ఆ పని చేయాలి’ అంటూ డిమాండ్‌ చేశారు. కాగా కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ ప్రధాన స్థావరం బాలకోట్‌లో భారత వైమానిక దళం బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పంక్తువా ప్రావిన్స్‌లోని జైషే క్యాంపులపై సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థంతో ఐఏఎఫ్‌ విరుచుకుపడింది. ఈ మెరుపు దాడుల్లో పన్నెండు మిరాజ్‌- 2000 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.

మరిన్ని వార్తలు