ఇక ఆఫీస్‌కు నో జీన్స్‌-టీ షర్ట్‌

27 Jun, 2018 16:51 IST|Sakshi

జైపూర్‌ : రాజస్థాన్‌ లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ జారీ చేసిన సర్క్యులర్‌ ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఇక మీదట ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చే సమయంలో జీన్స్‌, టీ షర్ట్‌ వంటి అభ్యంతరకరమైన దుస్తులు ధరించ కూడదని సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నెల 21న లేబర్‌ కమిషనర్‌ గిర్రియాజ్‌ సింగ్‌ కుష్వాహా ఈ సర్క్యులర్‌ను జారీ చేశారు.

ఈ విషయం గురించి గిర్రియాజ్‌ ‘కొంతమంది ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేటప్పుడు జీన్స్‌, టీ షర్ట్‌ లాంటి అభ్యంతరకర దుస్తులు ధరించి వస్తున్నారు. ఇలాంటి దుస్తులు ధరించి విధులకు హాజరవ్వడం అంటే వారు తమ ఉద్యోగానికి, ఆఫీస్‌కు మర్యాద ఇవ్వనట్లే. ఈ పరిస్థితిని మార్చడం కోసం ఈ నోటీస్‌ను జారీ చేయాల్సి వచ్చింది. ఇక మీదట ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేటప్పుడు ప్యాంట్‌, షర్ట్‌ మాత్రమే ధరించే రావాలి’ అన్నారు.  అయితే ఈ నోటీస్‌ గురించి ఇంతవరకూ ఉద్యోగుల నుంచి తనకు ఎటువంటి ఫీడ్‌బ్యాక్‌ అందలేదని తెలిపారు.

ఈ విషయం గురించి ‘ఆల్‌ రాజస్థాన్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌’ ప్రెసిడెంట్‌ గజేంద్ర సింగ్‌ మాట్లాడుతూ ఈ నోటీస్‌ను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. జీన్స్‌, టీ షర్ట్‌ ధరించడం అభ్యంతకరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి సర్వీస్‌ రూల్స్‌ రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఈ నోటీస్‌ను విత్‌డ్రా చేసుకోవాల్సిందిగా కమిషన్‌ను కోరాతామని చెప్పారు.

మరిన్ని వార్తలు