అంగుళం భూమినీ ముట్టుకోలేరు

18 Jul, 2020 04:54 IST|Sakshi
స్టాక్నా సైనిక శిబిరం వద్ద తుపాకీ గురిపెట్టిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

లద్దాఖ్‌లో సైనికులతో మంత్రి

లద్దాఖ్‌: ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారత్‌ నుంచి ఒక్క అంగుళం భూమిని కూడా లాక్కోలేదని, దేశం బలహీనమైంది కానేకాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. చైనాతో ఘర్షణల నేపథ్యంలో శుక్రవారం లద్దాఖ్‌ లోని సరిహద్దు ప్రాంతాలను సందర్శించిన ఆయన లుకుంగ్‌లో ఆర్మీ, ఐటీబీపీ జవా న్లను ఉద్దేశించి ప్రసంగించారు.

తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో చైనాతో తలెత్తిన సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు చర్చలు కొనసాగుతు న్నాయని చెప్పిన ఆయన అవి ఎంత మేరకు విజయవంత మవుతాయో మాత్రం కచ్చితంగా చెప్పలేమని వ్యాఖ్యానించడం గమనార్హం. జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమని ఆయన అన్నారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవాణేలతో కలిసి ఒక రోజు లేహ్‌ పర్యటనకు వచ్చిన రక్షణ మంత్రి పాంగాంగ్‌ సో సరస్సు తీరంలోని ఓ స్థావరంలో సైనికాధి కారులతో పరిస్థితిని సమీక్షించారు.

సైనిక విన్యాసాలను తిలకించిన రాజ్‌నాథ్‌
లద్దాఖ్‌ ప్రాంతంలోని స్టాక్‌నా ప్రాంతంలో శుక్రవారం జరిగిన మిలటరీ సైనిక విన్యాసాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ తిలకించారు. ఆర్మీ, వాయుసేనలకు సంబంధించిన ఆపాచీ, వీ5 యుద్ధ హెలికాప్టర్లు, రుద్ర, మిగ్‌–17 విమానాలతో పాటు ట్యాంకులు, పదాతిదళాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. తమ యుద్ధ సన్నద్ధతను చాటాయి. స్టాక్‌నా ప్రాంతంలో పారాట్రూపర్లు, జవాన్ల పాటవాన్ని ప్రత్యక్షంగా చూడగలిగానని ట్విట్టర్‌లో రాజ్‌నా«ద్‌ వ్యాఖ్యానించారు.

శాంతి కోసం ఏమైనా చేస్తా
భారత్‌ చైనా పరిస్థితిపై ట్రంప్‌
భారత్, చైనాల మధ్య శాంతి నెలకొనేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపినట్లు వైట్‌హౌస్‌ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. వాస్తవాధీన రేఖ వద్ద ఇరుదేశాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘భారత్, చైనా ప్రజలంటే తనకిష్టమని ట్రంప్‌ తెలిపారు. ప్రజలకు శాంతిని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతానని చెప్పారు’’అని వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి కేలీ మెక్‌ఎనానీ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ట్రంప్‌ వ్యాఖ్యను ట్రంప్‌ విక్టరీ ఇండియన్‌ అమెరికన్‌ ఫైనాన్స్‌ కమిటీ సహాధ్యక్షుడు అల్‌ మాసన్‌ స్వాగతించడమే కాకుండా.. గత అధ్యక్షుల మాదిరిగా కాకుండా ట్రంప్‌ బహిరంగంగా భారత్‌కు మద్దతు తెలిపారని వ్యాఖ్యానించారు. గతంలో అమెరికా అధ్యక్షులు చైనా ప్రయోజనాలు దెబ్బతింటాయేమో అని భారత్‌కు మద్దతుగా నిలిచేందుకు భయపడేవారని, భారత్‌ అంటే తనకిష్టమని చెప్పగలిగిన ధైర్యం ట్రంప్‌కు మాత్రమే ఉందన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు