యడ్యూరప్పకు ఊరట

27 Oct, 2016 02:29 IST|Sakshi
యడ్యూరప్పకు ఊరట

అవినీతి కేసులో సీబీఐ కోర్టు క్లీన్‌చిట్
 
 సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పకు సీబీఐ ప్రత్యేకకోర్టులో పెద్ద ఊరట లభించింది. అవినీతి కేసులో ఆయనతోపాటు ఇద్దరు కుమారులు, అల్లుడు, మరో 9 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పుడు రూ.40 కోట్ల ముడుపులు తీసుకొని బళ్లారిలో అక్రమ మైనింగ్‌కు అనుమతులిచ్చినట్లు కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలను చూపడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ  కోర్టు జడ్జి ఆర్‌బీ ధర్మేగౌడ బుధవారం తీర్పు చెప్పారు. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఈ కేసులో 13 మందిపై దాఖలైన అభియోగాలను జడ్జి కొట్టివేశారు.

వీరందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నామని 400 పేజీల తీర్పులో పేర్కొన్నారు. తీర్పు సమయంలో కోర్టు హాల్లో ఉన్న యడ్యూరప్ప ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. ఈ కేసులో యడ్యూరప్ప ప్రధాన నిందితుడిగా ఉండగా, ఆయన కుమారులు రాఘవేంద్ర(ఎమ్మెల్యే),విజయేంద్ర, అల్లుడు సోహన్ కుమార్ మరో 9మందిపైనా సీబీఐ 2012లో చార్జిషీటు వేసింది.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న యడ్యూరప్పకు ఈ తీర్పుతో ఊరట లభించింది. ‘సత్యమేవ జయతే’ అని తన సంతోషాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు.

 కేసు పూర్వాపరాలు... 2008-11లో యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పుడు జిందాల్ కంపెనీకి చెందిన సౌత్‌వెస్ట్ మైనింగ్ సంస్థకు కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా తనకు సంబంధించిన ‘ప్రేరణ’ ఎన్జీవోకు రూ.20 కోట్లు విరాళాలుగా పొందినట్లు సీబీఐ అభియోగం. బెంగళూరు జిల్లా రాచేనహళ్లి వద్ద ఎకరా స్థలాన్ని డీనోటిఫై చేయడం వల్ల యడ్యూరప్ప కుమారులైన రాఘవేంద్ర, విజయేంద్ర, అల్లుడు సోహన్ రూ.18.78 కోట్లు లాభపడ్డారనీ ఆరోపించింది. రూ.40 కోట్ల ముడుపులు పొంది రాష్ట్ర ఖజానాకు రూ.800 కోట్ల నష్టం తెచ్చారని ‘సమాజ పరివర్తన’ నేత హీరేమఠ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఆరోపణలు నిజమంటూ లోకాయుక్త సంతోష్ హెగ్డే ప్రభుత్వానికి నివేదికివ్వడంతో  2011లో యడ్యూరప్ప సీఎం పీఠం నుంచి తప్పుకున్నారు.

>
మరిన్ని వార్తలు