దళిత మహిళలపై ఇలాంటి దారుణాలెన్నో!

21 Jun, 2018 16:17 IST|Sakshi
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో గతేడాది డిసెంబర్‌లో దళిత మహిళపై టీడీపీ నాయకుల దాష్టీకం

సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత దేశంలో పుట్టుకతోనే దళిత మహిళలపై వివక్ష కొనసాగుతోంది. దళిత యువతులపై దారుణాలు జరుగుతున్నాయి. దళిత మహిళలను ఎప్పుడైనా ఏమైనా చేయవచ్చని, ఏం చేసినా చెల్లిపోతుందని, తమకు వ్యతిరేకంగా నోరు విప్పేవారే ఉండరన్నది అగ్రవర్ణాల అహంకారం. నిర్జన ప్రదేశాల్లో దళిత బాలికలు, యువతులు కనిపిస్తే వారిపై అగ్రవర్ణాల మగాళ్లు ఎక్కడెక్కడనో చేతులు పెడతారు, ఏవేవో తడుముతారు. అనుకుంటే వారి ఇళ్లకు, వారి గదుల్లోకి, వారి పక్కలోకి వెళ్లగలమని భావిస్తారు. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదని,  తమను ఎవరు ఏమీ చేయలేరన్నది అగ్రవర్ణ మగవాళ్ల ఆలోచన’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన సుమన అనే దళిత మహిళ వ్యక్తం చేసిన ఆవేదన ఇది.

‘అధికారంలో ఉన్నా దళిత మహిళలకు రక్షణ లేదు. వారిని కూడా అగ్రవర్ణాల వారే నియంత్రిస్తుంటారు. దళితులపై జరిగిన దాడికో, దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలబడితే దళిత సర్పంచ్‌లను కూడా లక్ష్యంగా చేసుకొని హింసిస్తారు. చంపేస్తారు. ఓ గ్రామంలో దళిత మహిళపై జరిగిన దారుణాన్ని ఓ దళిత మహిళా సర్పంచ్‌ ప్రశ్నించినందుకు ఆమెను, ఆ మహిళను సజీవంగా దహనం చేశారు. మరో దారుణాన్ని ప్రశ్నించినందుకు ఓ దళిత సర్పంచ్‌ మేనల్లుడిని చితకబాదారు. ఈ రెండు సంఘటనల్లో ఎలాంటి కేసులు లేవు. శిక్షలు లేవు. నేను కూడా నా విధులను సక్రమంగా నిర్వర్తించాలని అనుకుంటాను. అగ్రవర్ణాల వారు చేయనీయరు’ అని అదే రాష్ట్రానికి చెందిన గాయత్రి అనే ఓ గ్రామ సర్పంచ్‌ చెప్పిన కథనం.

‘అగ్రవర్ణాల మహిళలు, దళిత మహిళలు ఒక్కటేనంటే, వారిద్దరు సమానమంటే నేను ఒప్పుకోను. 15 ఏళ్ల దళిత బాలికలపై 33.2 శాతం అత్యాచారాలు జరుగుతుంటే అగ్రవర్ణాల బాలికలపై 19.7 శాతం అత్యాచారాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. దళిత మహిళలపై జరుగుతున్న దారుణాల్లో వందకు ఐదు కేసులు మాత్రమే కోర్టుకు వస్తున్నాయి. ముందుగా కేసులు దాఖలైనా ఒత్తిళ్ల మేరకు అవి కోర్టు వరకు చేరుకోవు’ అని హర్యానాలో పానిపట్‌లో సవిత అనే దళిత లాయర్‌ అభిప్రాయపడ్డారు.

జెనీవా సదస్సుకు నివేదన
వీరి అభిప్రాయాలను జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల 38వ సమావేశంలో ‘అఖిల భారత దళిత మహిళా అధికార్‌ మంచ్‌’ నాయకులు గురువారం నాడు వినిపించారు. జూన్‌ 19వ తేదీ నుంచి ఈ సమావేశాలు కొనసాగుతుండగా, తమ వాదనను వినిపించేందుకు తమకు ఈ రోజు అవకాశం లభించినట్లు మంచ్‌ ప్రధాన కార్యదర్శి ఆశా కోతల్‌ తెలిపారు. దేశంలో కుల వివక్ష కొనసాగుతోందని, ముఖ్యంగా దళితులను అంటరాని వారిగా చూస్తారని భారత ప్రభుత్వం ఏనాడు అంతర్జాతీయ వేదికలపై అంగీకరించలేదు. పైగా అదంతా అబద్ధమంటూ ఖండించేది. వివక్ష దాడుల గురించి ఇలా వివరించినప్పుడు అది తమ అంతర్గత విషయమని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ ముక్తిసరి మాటలతోనే వాస్తవాలకు మసిపూసేది. ఈ మాత్రం అంగీకరించడం కూడా డర్బన్‌లో 2001లో జాతి విద్వేశంపై జరిగిన ప్రపంచ సదస్సులోనే జరిగింది. కుల వివక్ష అంశాన్ని జాతి విద్వేశంతో సమానంగా చూడవద్దని నాడు సదస్సును కోరింది. భారత్‌లో కొనసాగుతున్న కుల వివక్షతపై ఐక్యరాజ్య సమితి జాతి వివక్ష నిర్మూలన కమిటీ సభ్యురాలు రీటా ఇసాక్‌ 2016లో విడుదల చేసిన నివేదికను కూడా భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండించింది.

పోగొట్టుకోవడానికి మా వద్ద ఏమీ మిగల్లేదు
ప్రపంచ సదస్సుల్లో భారత్‌లో కొనసాగుతున్న కుల, లింగ వివక్షతలపై అంతర్జాతీయ హక్కుల సంఘాలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, నివేదికల్లో వివక్షత తీవ్రత ప్రతిబింబించడం లేదన్న ఉద్దేశంతో దళిత మహిళా అధికార మంచ్‌ తొలిసారిగా దళిత మహిళల అభిప్రాయాలను వారి మాటల్లోనే వ్యక్తం చేసింది. ‘వాయిసెస్‌ అగనెస్ట్‌ క్యాస్ట్‌ ఇంప్యునిటీ: న్యారెటీస్‌ ఆఫ్‌ దళిత విమెన్‌ ఇన్‌ ఇండియా’ శీర్షికతో సమావేశానికి సమర్పించింది. ‘కుల వ్యవస్థ చావు కేకలను వినేందుకు మేము గుండెలు దిటువు చేసుకొని ముందుకు వెళుతున్నాం. విజయం కోసం మేము అన్నీ వదులుకున్నాం. పోగొట్టుకోవడానికి మా వద్ద ఇంకా ఏమీ మిగల్లేదు’ అన్న వ్యాఖ్యలతో ఆ నివేదికను ముగించారు.

మరిన్ని వార్తలు